కదిరి అర్బన్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరగానే అధికారం అండలో టీడీపీ నేతలు దోపిడీలకు తెగబడ్డారు. భూదందాలు, ప్రైవేటు పంచాయితీలతో భారీగా ఆర్జిస్తున్నారు. మరికొందరు ‘తమ్ముళ్లు’ సహజవనరులను కొల్లగొట్టి రూ.కోట్లు సంపాదిస్తున్నారు. తాజాగా కదిరిలోని పచ్చ నేతలు చెరువులను చెరబట్టారు. సారవంతమైన మట్టిని తవ్వుకుని తరలిస్తున్నారు.
చెలరేగుతున్న మట్టిమాఫియా..
కదిరిలో మట్టిమాఫియాగా మారిన తెలుగు తమ్ముళ్లు... దేవరచెరువు, విఠలరాయుని చెరువు, సున్నపుగుట్టతండా సమీపంలోని గుట్టలు...ఇలా ఎక్కడ బడితే అక్కడ మట్టిని తవ్వేస్తున్నారు. దేవరచెరువు కట్టపై ఒకవైపు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సుందరీకరణ అంటూ హడావుడి చేస్తుండగా...అదే చెరువు నుంచి రాత్రివేళల్లో ‘తమ్ముళ్లు’ మట్టిని అక్రమంగా తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టి రూ.4 వేల చొప్పున విక్రయిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. రోజూ వందలాది టిప్పర్లు మట్టి తరలిస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మట్టిమాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇంత విచ్చలవిడిగా మట్టిమాఫియా రెచ్చిపోతోందంటే ఇదంతా ఎమ్మెల్యేకు తెలియకుండా జరుగుతుందా...అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతోనే అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నారు.
కళ్లముందే టిప్పర్లు పోతున్నా..
రాత్రి 12 గంటల సమయంలో కదిరి జీవిమాను కూడలిలో పోలీసుల ముందే ఒకదానివెనుక ఒకటి మట్టి టిప్పర్లు తరలిపోతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులకు చిత్తశుద్ధి ఉంటే పట్టణంలో అన్ని కూడళ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటిని పరిశీలించి అయినా మట్టి అక్రమ తరలింపుపై కేసులు నమోదు చేయవచ్చు.
– అరుణ్‌కుమార్, భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, కదిరి
మట్టి మాఫియాగా మారిన
తెలుగు తమ్ముళ్లు
రోజూ రాత్రి వేళల్లో
చెరువు నుంచి మట్టి తరలింపు
మరోవైపు సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే ఆర్భాటం


