పుట్టపర్తి: ఓపెన్ స్కూల్‌లో అడ్మిషన్లకు ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ లాజరు పేర్కొన్నారు. బుధవారం ఆయన మడకశిర, పెద్దమంతూరు, రాళ్లపల్లి, మావటూరు తదితర స్కూళ్లు, కళాశాలల్లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్లపై అవగాహన కల్పించి పోస్టర్లు ప్రదర్శించారు. చదువు మానేసిన వారు తిరిగి కొనసాగించేందుకు ఓపెన్ స్కూల్ అద్భుతమైన అవకాశమన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలని సూచించారు.
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక
సోమందేపల్లి(పరిగి): ఇన్‌స్పైర్ మనాక్ అవార్డు కోసం నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు సోమందేపల్లి మండలంలోని జూలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎస్. విష్ణువర్దన్‌రెడ్డి ఎంపికయ్యాడు. ఈమేరకు గైడ్ టీచర్ నరసింహమూర్తి వివరాలను తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ఇన్నోవేటివ్ ఐడియాలను ప్రోత్సహించడానికి ఇన్‌స్పైర్ మనాక్ అవార్డులు అందిస్తారన్నారు. ఇందులో తమ పాఠశాలకు చెందిన విష్ణువర్దన్‌రెడ్డి విత్తనాలు తడవకుండా ఎండబెట్టే ప్రాజెక్టుతో ఇటీవల జరిగిన జిల్లా, రాష్ట్ర స్థాయిల పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ ప్రాజెక్టు అత్యుత్తమమైనదిగా భావించిన నిర్వాహకులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. విష్ణువర్దన్‌రెడ్డి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడంపై ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించి, హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో రాణించి అవార్డు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నీటి కోసం
మహిళల నిరసన
తలుపుల: పదిరోజులుగా తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..అధికారులు పట్టించుకోకపోవడంతో తలుపుల సంగం బజార్‌కు చెందిన మహిళలు ఆందోళనకు దిగారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని బుధవారం ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ...తాము పది రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా...అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తాగునీటి సమస్యపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మహిళలకు సర్దిచెప్పారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రవణప్పనాయుడుని పిలిపించారు. ఆయన వచ్చి తాగునీటి సమస్య పరిష్కారమయ్యే వరకూ తాత్కాలికంగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తామని చెప్పడంతో మహిళలు శాంతించారు.
రూ.6 కోట్లతో పరార్
● చీటీలతో పాటు భారీగా అప్పులు
● రాత్రికి రాత్రే ఉడాయించిన డ్వామా ఉద్యోగి
కదిరి టౌన్: డ్వామా టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి చీటీలు, డైలీ కలెక్షన్ పేరుతో దాదాపు రూ.6 కోట్ల దాకా మోసం చేసి పరారయ్యాడు. బాధితుల వివరాల మేరకు.. కదిరికి చెందిన వీబీజీ రామ్‌జీ టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి పదేళ్లుగా డబ్బులు వడ్డీకి ఇవ్వడంతో పాటు చిట్టీలు నిర్వహించేవాడు. నమ్మకంగా డబ్బులు వెనక్కు ఇస్తుండటంతో డ్వామా కార్యాలయంలోని టెక్నికల్ ఇంజనీర్లు, టెక్నికల్ అసిస్టెంట్లతోనే దాదాపు రూ.30 లక్షలు, జ్ఞానేశ్వర్‌రెడ్డితో రూ.40 లక్షలు, ఎస్‌పీఎస్ మెడికల్ స్టోర్ నిర్వాహకుడితో రూ.18 లక్షలు, కమలాకర్ మూర్తితో రూ. 5 లక్షలు, రామాంజనేయనాయక్ రూ.5 లక్షలు, అలాగే ఇతరులతో పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. మొత్తంగా రూ.6 కోట్ల దాకా వసూలు చేశాడు. చీటీలు ఎత్తిన వారికి డబ్బులు ఇవ్వకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి అతని ఇంటి వద్దకు బాధితులు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.


