సాక్షి, పుట్టపర్తి: గతంలో కూలీలు, సాధువులు, బిచ్చగాళ్లు మాత్రమే గంజాయి పీల్చేవారు. ఇప్పుడు విద్యార్థులు, యువకులు కూడా గంజాయి మత్తుకు అలవాటు పడుతున్నారు. ఇన్నాళ్లూ పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన గంజాయి గుప్పు ప్రస్తుతం పల్లెల వరకు పాకింది. తాము అధికారంలోకి వస్తే గంజాయి ఆట కట్టిస్తామని కూటమి నాయకులు ప్రగల్బాలు పలికారు. కానీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి గంజాయి మత్తులో ఎన్నో అఘాయిత్యాలు వెలుగు చూశాయి. గంజాయి విక్రయిస్తున్న, వినియోగిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని బడాబాబుల అండదండలతో కొందరు గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. గుడి, బడి తేడా లేకుండా అన్ని చోట్ల గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో మౌనంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీసత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తి మొదలు కదిరి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు తెలిసింది.
ప్రతి రోజూ సాయంత్రం నుంచి గంజాయి గురించి యువత ఆలోచిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా సమాచారం చేరవేసుకుని రోజుకో ప్రాంతానికి వెళ్లి గంజాయి పీలుస్తున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. మత్తులో హత్యలకూ వెనుకాడటం లేదు. గతేడాది పుట్టపర్తి మున్సిపాలిటీ బ్రాహ్మణపల్లిలో ఓ హత్య కేసులో నిందితులు గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. అయితే కేసు పక్కదోవ పట్టించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా చిత్రావతి రోడ్డులో ఓ విదేశీయుడు గంజాయి మత్తులో భవనం పైనుంచి పడి చనిపోయిన ఘటన నెల క్రితం కలకలం రేపింది. గంజాయి ఒక్కసారి పీల్చితే రోజంతా మత్తు ఉండటంతో చాలామంది బానిసలవుతున్నారు. గంజాయి కోసం వెంపర్లాడుతున్నారు. గత 2024 విజయదశమి రోజున చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి మద్ద అత్తా–కోడలిపై సామూహిక అత్యాచారం చేసిన వారందరూ గంజాయి మత్తులో ఉన్నట్లు తెలిసింది. పోలీసులు అధికారికంగా వెల్లడించలేదు. గ్యాంగ్ రేప్‌లోని నిందితులపై అంతకుముందు గంజాయి కేసులు ఉన్నట్లు సమాచారం.
ప్యాకెట్ల రూపంలో కిలోల లెక్కన గంజాయి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అక్కడక్కడా నిల్వ చేసి చాక్లెట్లు, పెన్నుల్లో నింపి విక్రయిస్తున్నారు. రూ.100 చెల్లిస్తే రోజుకు కావాల్సినంత మత్తు వచ్చే గంజాయి లభిస్తోంది. దీంతో చిన్న ప్యాకెట్ల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు, కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాలో యథేచ్ఛగా విక్రయాలు
మారుమూల ప్రాంతాలకూ
విస్తరించిన మహమ్మారి
పెన్నులు, చాక్లెట్ల రూపంలో అమ్మకాలు
పుట్టపర్తి, పెనుకొండ, కదిరి,
హిందూపురంలో అధికం
మత్తులో ఘోరాలకు పాల్పడుతున్న వైనం
2026 సెప్టెంబరు 5 : తలుపుల మండలం పూలవాండ్లపల్లిలో గంజాయి మొక్కలు సాగు చేసి విక్రయిస్తున్న శాంతమ్మ, నారాయణ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 5.430 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా విక్రయానికి సిద్ధంగా ఉంచిన మరో 20 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెన్నయ్య తెలిపారు.
చీకటి పడగానే శివారు ప్రాంతాలకు
వివిధ రూపాల్లో అమ్మకాలు
2026 సెప్టెంబరు 4 : గంజాయి వినియోగించడంతో పాటు విక్రయిస్తున్న నలుగురిని హిందూపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1.6 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముక్కిడిపేటకు చెందిన గౌతమ్, శ్రీకంఠపురానికి చెందిన అరుణ్‌కుమార్, ఆటోనగర్‌కు చెందిన బాబా, లక్ష్మీపురానికి చెందిన మనోజ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ మహేశ్ పేర్కొన్నారు.


