నేడు పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు పరిష్కార వేదిక

Sep 7 2026 7:27 AM | Updated on Sep 7 2026 7:27 AM

ప్రశాంతి నిలయం: ప్రశాంతి రైల్వేస్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఏ.శ్యామ్‌ప్రసాద్‌ తెలిపారు. అన్ని డివిజన్‌, మండల కేంద్రాలు, మున్సిపల్‌ కార్యాలయాలలో కూడా కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

పోలీస్‌ కార్యాలయంలో..

పుట్టపర్తి టౌన్‌: పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.

చెరువును చెరబట్టాడు..

ఎన్‌పీకుంట: మండల పరిధిలోని ధనియానిచెరువు గ్రామ సమీపంలోని చెరువును ఓ టీడీపీ నాయకుడు చెరబట్టాడు. అక్రమార్జనే ధ్యేయంగా మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా వందలాది ట్రాక్టర్ల మట్టిని అక్రమంగా తరలిస్తూ జేబులు నింపుకుంటున్నాడు. సెలవు రోజులను ఆసరాగా చేసుకుని అధికారులు లేని సమయంలో చెరువులో జేసీబీలతో మట్టి తవ్వి యథేచ్ఛగా తరలిస్తున్నాడు. ఈ విషయమై తహసీల్దార్‌ లక్ష్మమ్మను వివరణ కోరగా మట్టి తరలింపునకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. మట్టి తవ్విన ప్రదేశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బీజేవైఎం జిల్లా

ఉపాధ్యక్షుడిపై పోక్సో కేసు

అరెస్టు చేసి జైలుకు పంపిన పోలీసులు

కదిరి టౌన్‌: బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు, కదిరి పట్టణానికి చెందిన తిమ్మరాజుపై పోక్సో కేసు నమో దైంది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం జైలుకు పంపినట్లు సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. పట్టణానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ప్రేమ పేరుతో ఇటీవల తిమ్మరాజు దగ్గరయ్యాడు. బాలికపై అనుమానం పెంచుకుని వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు తిమ్మరాజుపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆదివారం తిమ్మరాజును అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు.

● మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అనుచరుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్‌ కుమారుడైన తిమ్మరాజు గతంలో బార్‌ రమణ కుమారుడు పిట్టుపై హత్యాయత్నం చేసిన కేసులో 3 నెలల పాటు జైలులో ఉన్నాడు. ఖాద్రీ ఆలయం వద్ద టెంకాయల టెండర్‌ సమయంలో మహిళలపై ఇతను దాడి చేశాడు. అంతేకాకుండా తను నివాసముండే అడపాల వీధిలో అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతుంటాడనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో అప్పటి సీఐ వి.నారాయణరెడ్డి తిమ్మరాజు ఇంట్లో సోదాలు చేయడం గమనార్హం.

‘స్థానిక’ ఎన్నికలకు

సిద్ధంగా ఉండండి

అనంతపురం న్యూటౌన్‌: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్‌,గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్‌ సుధాకర్‌రావు ఆదేశించారు. ఆదివారం ఆయన డీడీఓలు, ఎంపీడీఓలు తదితరులతో జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే గ్రామాలను గుర్తించి మ్యాపింగ్‌ చేయాలని సూచించారు. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి ప్రచురించిన ఓటర్ల జాబితాలను ఆన్‌లైన్‌ చేయడంతో పాటు మూడు సెట్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.పంచాయతీలకు సంబంధించి స్టేజ్‌–1, స్టేజ్‌–2 ఎన్నికల అధికారుల జాబితాలతో జిల్లా, మండల, గ్రామస్థాయిలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement