పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ సీజన్‌లో సాగైన కంది పంటను బెట్ట నుంచి రక్షించుకోవాలని ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పేర్కొన్నారు. ఆదివారం పుట్టపర్తి సమీపంలోని ఓ రైతు సాగు చేసిన కంది పంటను పరిశీలించారు. వారం రోజుల నుంచి ఎండ తీవ్రత పెరగడంతో కంది పంట బెట్టకు గురైందన్నారు. రక్షించుకునేందుకు పొటాషియం నైట్రేట్ 5 గ్రాములను లీటరు నీటికి కలిపి 15 రోజులకోసారి పిచికారీ చేయాలన్నారు. అలాగే 60 రోజులకు, 90 రోజులకు ఓమైట్ ఒక మి.లీ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. దీంతో మొక్కకు వెర్రి తెగులు రాకుండా నివారించవచ్చన్నారు. దగ్గర్లో నీటి సదుపాయం ఉంటే ఒక తడి ఇవ్వడానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 30,712 హెక్టార్లలో కంది సాగు చేశారన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్
● శింగనమల సబ్ రిజిస్ట్రార్‌తో పాటు సీకే పల్లి సీనియర్ అసిస్టెంట్‌పై వేటు
అనంతపురం టౌన్: ప్రభుత్వ భూములతో పాటు రికార్డుల్లోలేని భూములను రిజిస్ట్రేషన్ చేసిన ఇద్దరు రిజిస్ట్రేషన్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డీఐజీ విజయలక్ష్మీ ఉత్తర్వులను జారీ చేశారు. శింగమనల సబ్ రిజిస్ట్రార్ గురునాథ్ వెబ్‌ల్యాండ్‌లో లేని భూమిని భాగ పరిష్కరాల రిజిస్ట్రేషన్ చేశారని ఫిర్యాదు రావడంతో విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు. నార్పల మండలం చామలూరుకు చెందిన భూములు సర్వేనంబర్ 374, 377–3, 378, 385, 386లోని భూములను వెబ్‌ల్యాండ్‌లో పేర్లు లేకున్నా వేరొకరి పేరుతో భాగ పరిష్కారల రిజిస్ట్రేషన్ 3344–2025 గత ఏడాది నవంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ గురునాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న అనిల్‌కుమార్ అసైన్డ్ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అరోపణల నేపథ్యంలో ఇరువురిపై విచారణ చేపట్టిన డీఐజీ విజయలక్ష్మీ ఆరోపణలు రుజువు కావడంతో ఇద్దరిపై వేటు వేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.
సంసారాన్ని పట్టించుకోవాలన్న భార్య.. ఉరేసుకున్న భర్త
బత్తలపల్లి: నిత్యం తాగుతుంటే ఎలా? సంసారాన్ని కూడా పట్టించుకోమని భర్తను భార్య మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని జ్వాలాపురంలో ఆదివారం చోటు చేసుకుంది. బత్తలపల్లి పోలీసుల వివరాల మేరకు... జ్వాలాపురానికి చెందిన తలారి రామాంజనేయులు (40), నాగమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కూలి పనులు, పాడి ఆవులు చూసుకుంటూ కుటుంబాన్ని నాగమ్మ పోషిస్తోంది. రామాంజనేయులు కూలి పనులకు వెళ్లి ఇంట్లో డబ్బులు ఇవ్వకుండా తాగుడుకే ఖర్చు పెట్టుకునేవాడు. సంసారం బాధ్యతలు నాగమ్మ చూసుకుంటూ కుమారుడిని బీటెక్ చవిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పిల్లలు పెద్ద వాళ్లు అవుతున్నారు.. సంసారం పట్టించుకోమని భార్య.. భర్తను మందలించింది. కుమారుడు తిరుపతికి కళాశాలకు వెళ్లగా, భార్య, కుమార్తె పాడి ఆవులకు మేత కోసం బయటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామాంజనేయులు చీరతో తాటి తీర్లకు ఉరి వేసుకున్నాడు. స్థానికులు వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు. బత్తలపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేపు ఎస్టీ కమిషన్ చైర్మన్ రాక
ప్రశాంతి నిలయం: రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌తో పాటు ఐదుగురు కమిటీ సభ్యుల బృందం కూడా పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాత్రికి కదిరిలోని ఆర్‌ఆండ్‌బీ బంగ్లాకు చేరుకుని అక్కడ బస చేస్తారన్నారు. 8న నల్లచెరువు మండలం బలేపల్లి తండా, ముదిగుబ్బ మండలం సానేవారిపల్లి ఎస్టీ కాలనీ, గురుగు తండా సందర్శించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు కదిరి అర్‌అండ్‌బీ బంగ్లాలో గిరిజన నాయకులు ,ప్రజా సంఘాలు, ఉద్యోగులు, ప్రజలతో సమావేశమై అర్జీలు స్వీకరిస్తారన్నారు.
ఎల్లమ్మ ఆలయంలో చోరీ
శెట్టూరు: మండలంలోని కై రేవు గ్రామంలో శనివారం అర్ధరాత్రి గ్రామ దేవత ఎల్లమ్మ ఆలయంలో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం రాత్రి కై రేవులో వీధినాటకాన్ని ప్రదర్శించారు. ఇదే అదునుగా భావించిన దుండుగులు ఆలయంలోకి చొరబడి సుమారు 60 తులాల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. అర్చకులు గుర్తించి గ్రామస్తుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుమన్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.


