రెచ్చిపోతున్న మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న మట్టి మాఫియా

Aug 27 2026 12:06 AM | Updated on Aug 27 2026 12:06 AM

కదిరి అర్బన్‌: నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అధికార పార్టీ నేతల అండతో కొండలు, గుట్టల్ని పిండిచేస్తోంది. మట్టి టిప్పర్లతో గ్రామాల్లో తారు రోడ్లు సైతం దెబ్బతింటున్నాయి. అక్రమార్కులు కొండలు, గుట్టల్ని కొల్లగొడుతుంటే ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపమే మారిపోతోంది. మట్టిని పట్టణ శివార్లలో అక్రమ వెంచర్లకు తరలించి వెంచర్లు ఎత్తు పెంచేస్తుండడంతో భారీ వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీటితో పాటు మురుగు నీరు ఎలా పడితే అలా ప్రవహిస్తూ జనవాసాలను ముంచెత్తుతోంది.

బైపాస్‌ రోడ్డు సైతం దెబ్బతినేలా..

కదిరి మండలం పందుల కుంటకు వెళ్లే దారి పక్కన గుట్టలో హిటాచీలు పెట్టి ఇష్టారాజ్యంగా మట్టి తవ్వుతున్నారు. అలాగే సున్నపుగుట్టతండా వద్ద ఉన్న గుట్టల నుంచి, దేవరచెరువులో నుంచి మట్టిని యథేచ్ఛగా టిప్పర్లలో నూతన బైపాస్‌ రోడ్డు మీదుగా పట్టణంలోని అక్రమ వెంచర్‌లకు తరలిస్తున్నారు. రోజు 100కు పైగా టిప్పర్ల మట్టిని పట్టణంలోని అక్రమ వెంచర్లకు తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌ మట్టిని రూ.4 వేల దాకా అమ్ముతారు. వంద టిప్పర్లు అంటే నిత్యం రూ. 4 లక్షలు జేబుల్లోకి వేసుకుంటున్నారు. అధిక లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ల ధాటికి నూతన బైపాస్‌ రోడ్‌ సైతం దెబ్బతింటోంది. ప్రభుత్వ కార్యాలయాల పని రోజుల్లో తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటలలోపు మట్టిని తరలిస్తున్నారు. ఎందుకంటే అధికారులు అప్పుడు ఇంటివద్దనే ఉంటారు. వారు విధులకు హాజరయ్యే సమయానికి ఆపేస్తున్నారు. తిరిగి సాయంత్రం కార్యాలయ పని వేళలు ముగిశాక రాత్రంతా యథేచ్ఛగా తోలుకుంటున్నారు. సెలవు రోజుల్లో రోజంతా కొల్లగొడుతున్నారు. మరోవైపు మట్టి అక్రమ రవాణా తంతు అధికారులకు తెలిసే జరుగుతోందా అన్న సందేహం ప్రజల్లో నెలకొంది. మైనింగ్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల తహసీల్దార్లు మట్టి అక్రమ రవాణా తమ పరిధి కాదని మైనింగ్‌ వాళ్లు చూసుకోవాలని చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది.

కదిరి నియోజకవర్గంలో

యథేచ్ఛగా దందా

నిద్రమత్తులో మైనింగ్‌, రెవెన్యూ,

పోలీస్‌ శాఖలు

మండిపడుతున్న ప్రజలు

ఎక్కడెక్కడ

కొల్లగొడుతున్నారంటే..?

కదిరి మండలంలో జౌకల రోడ్డు పక్కనున్న గుట్ట, తుమ్మల రోడ్‌లోని బిందెలఫ్యాక్టరీ వద్ద గుట్ట, దేవరచెరువు, మిద్దెవారిపల్లి వద్ద, నల్లచెరువు మండలంలో అల్లుగుండు వద్ద పాలకమ్మ చెరువు, బొమ్మిరెడ్డిపల్లి వద్ద సింగారాతిచెరువు వద్ద, తనకల్లు మండలం పెద్దచెరువు, కొక్కంటిక్రాస్‌ వద్ద, ఎన్‌పీ కుంట మండలం ధనియాన్‌చెరువు గుట్ట వద్ద, గాండ్లపెంట మండలం చిన్నమిట్ట వద్ద మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement