శ్రీశైలంలోనే ఆ ఐదుగురి అంత్యక్రియలు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలోనే ఆ ఐదుగురి అంత్యక్రియలు

Aug 27 2026 12:06 AM | Updated on Aug 27 2026 12:06 AM

బత్తలపల్లి: కుటుంబ కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఆత్మహత్యకు పాల్పడిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి అంత్యక్రియలను అక్కడే పూర్తి చేశారు. బత్తలపల్లి మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన పల్లపు సుధాకర్‌ (36), అతని సోదరులు ఆదిలక్ష్మి (50), మల్లీశ్వరి (45), శ్రీదేవి (38), మల్లీశ్వరి కుమారుడు మణికంఠ (14)లు రెండు రోజుల క్రితం శ్రీశైలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పల్లపు సుధాకర్‌ రక్త సంబంధీకులు శ్రీశైలం వెళ్లగా.. వారు కడసారి చూపులు చూసిన తరువాత ఐదుగురి మృతదేహాలకు హిందూ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడికి తీవ్ర గాయాలు

కూడేరు: మండల పరిధిలోని అరవకూరు చెరువు మలుపు వద్ద అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురంలోని కలెక్టర్‌ కార్యాలయ సమీపాన నివాసముంటున్న మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. అతని కనుగుడ్లు రెండూ బయటకు వచ్చాయి. రోడ్డు పక్కన పడి ఉన్న అతన్ని అటుగా వెళుతున్న వాహనదారులు గమనించి 108కి సమాచారమివ్వగా సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని అతనిని అనంతపురంలో సర్వజన ఆస్పత్రిలో చేర్చారు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ద్విచక్ర వాహనంలో వెళుతూ అదుపు తప్పి కింద పడ్డాడా.. లేక ఏదైన వాహనం ఢీకొందా అనేది తెలియాల్సి ఉంది.

ఎలక్ట్రికల్‌ దుకాణంలో చోరీ

ఉరవకొండ: స్థానిక అనంతపురం–బళ్లారి బైపాసు వద్ద ఉన్న గాయత్రి ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. షాపు యజమాని చంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షాపు వెనుక వైపు షట్టర్‌ను కట్‌ చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు రూ.10 వేల నగదుతో పాటు రూ.70 వేల విలువ చేసే సామాన్లు ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు చిక్కకుండా డీవీఆర్‌ను అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

స్పెషల్‌ టెట్‌పై

పునరాలోచించాలి: డీటీఎఫ్‌

రొళ్ల: స్పెషల్‌ టెట్‌పై ప్రభుత్వం పునరాలోచన చేయాలని డీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి మారుతిప్రసాద్‌, గౌస్‌లాజమ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2024–26 సంవత్సరాల్లో బీఈడీ చేసిన ఇన్‌సర్వీస్‌ ఉపాధ్యాయులకు స్పెషల్‌ టెట్‌లో అవకాశం కల్పించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు ఇది వరకే ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న ఎంతోమంది ఉపాధ్యాయులకు టెట్‌ గుదిబండగా మారిందని వాపోయారు. బోధన అనుభవం, వృత్తి పరమైన శిక్షణ, విద్యార్హతలను పరిగణనలోకి తీసుకుని వారికి ప్రత్యేక నిబంధన రూపొందించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఆ వైపుగా ప్రభుత్వం దృష్టి సారించి ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు మినహాయింపులు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా ప్రత్యేక టెట్‌ను సీబీటీ విధానంలో కాకుండా ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలన్నారు. అర్హత మార్కులను 40 శాతానికి తగ్గించాలని, సబ్జెక్ట్‌ టీచర్స్‌ బోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ప్రత్యేక టెట్‌ నోటిఫికేషన్‌ రద్దు చేసి ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు వెసులుబాట్లు కల్పిస్తూ రీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement