పావగడ: తాలూకాలోని వైఎన్ హొసకోట గ్రామంలో 7వ తరగతి విద్యార్థి రోహిత్ (13) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మృతుడు స్థానిక ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ఉదయం పాఠశాలకు వెళ్లమని రోహిత్‌కు అతని తండ్రి మల్లికార్జున తెలిపాడు. స్నానం చేయడానికి వెళ్లిన రోహిత్ ఎంత సేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబీకులు తలుపు తెరిచి చూడగా రోహిత్ ఉరి వేసుకున్న దృశ్యం చూసి హతాశులయ్యారు. వెంటనే రోహిత్‌ను పావగడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధృవీకరించారు. సంఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
తల్లి వానరం..
నీ ప్రేమకు సలాం!
రొళ్ల: తల్లి ప్రేమ అనేది మనుషుల్లోనే కాదు.. మూగ జీవాల్లో కూడా ఉంటుందని నిరూపించే ఘటన ఇది. బుధవారం సాయంత్రం రొళ్ల బస్టాండ్ ఆవరణలో ఓ తల్లి వానరం ఓ చంటి వానరాన్ని చేతిలో పట్టుకుని అటు.. ఇటు కలయదిరగడం పలువురికి కనిపించింది. స్థానికులను ఆరా తీస్తే చంటి వానరం మృతి చెంది రెండు రోజులు కావొస్తోందని, అయినా వదలకుండా తల్లి వానరం తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తోందని తెలిపారు. దీంతో తల్లి వానరం ప్రేమకు పలువురు సలాం కొడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
యువకుడిపై పోక్సో కేసు
బత్తలపల్లి: స్థానిక పోలీసుస్టేషన్‌లో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరం మండలం వసంతపురం గ్రామానికి చెందిన బెందల నాగేంద్ర కుమారుడు యుగంధర్ అదే గ్రామానికి చెందిన బాలికను మాయమాటలతో ప్రేమలోకి దింపాడు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో సోమవారం సంజీవపురం సమీపంలోని కాటికోటేశ్వరక్షేత్రం వద్ద ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు యత్నించారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలిక మంగళవారం మృతి చెందింది. యుగంధర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫైనల్లోకి దూసుకెళ్లిన జిల్లా హాకీ జట్లు
ధర్మవరం: తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్‌షిప్ హాకీ పోటీల్లో జిల్లా బాలుర, బాలికల జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయని హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు సూర్యప్రకాష్, జిల్లా హాకీ కోచ్ హస్సేన్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కిషోర్ తెలిపారు. బాలుర జట్టు మొదటి మ్యాచ్‌లో ఏలూరు జిల్లా జట్టుపై 2–0 గోల్స్, రెండో మ్యాచ్‌లో తిరుపతి జిల్లా జట్టుపై 2–1, క్వార్టర్ ఫైనల్‌లో అనంతపురం జిల్లా జట్టుపై 4–0, సెమీ ఫైనల్స్‌లో వెస్ట్ గోదావరి జిల్లా జట్టుపై 2–1 గోల్స్‌తో విజయం సాధించి ఫైనల్ చేరుకుందన్నారు. అలాగే బాలికల జట్టు మొదటి మ్యాచ్‌లో చిత్తూరు జిల్లా జట్టుపై 10–0 గోల్స్, రెండో మ్యాచ్‌లో ఎన్టీఆర్ జిల్లా జట్టుపై 5–0, క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అన్నమయ్య జిల్లా జట్టుపై 2–0, సెమీ ఫైనల్‌లో అనంతపురం జిల్లా జట్టుపై షూట్ అవుట్‌లో 3–1 గోల్స్‌తో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుందన్నారు. ఫైనల్‌లో కూడా రెండు జట్లు రాణించి కప్ సాధించాలని వారు ఆకాంక్షించారు.
10 టన్నుల
పశు మాంసం స్వాధీనం
● పురం నుంచి తరలిస్తుండగా
పట్టుకున్న కర్ణాటక పోలీసులు
హిందూపురం టౌన్: హిందూపురం నుంచి కర్ణాటకలోని బెంగళూరుకు అక్రమంగా రెండు టాటా ఏస్ వాహనాల్లో తరలిస్తున్న పశు మాంసాన్ని బుధవారం దేవనహళ్లి వద్ద కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. హిందూపురం నుంచి పశు మాంసాన్ని తరచూ బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హిందూపురం నుంచి రెండు టాటా ఏస్ వాహనాల్లో దాదాపు 10 టన్నుల పశు మాంసం తరలిస్తుండగా, కర్ణాటక పోలీసులు దేవనహళ్లి సమీపంలో వాహనాలను తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. హిందూపురం నుంచి పెద్ద ఎత్తున పశుమాంసం కర్ణాటకకు పగలు, రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నా ఇక్కడి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.


