అందరూ కుదేలు.. ఆదుకునేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అందరూ కుదేలు.. ఆదుకునేదెవరు?

Aug 27 2026 12:06 AM | Updated on Aug 27 2026 12:06 AM

అనంతపురం న్యూటౌన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలు గతంలో ఎన్నడూ లేని విధంగా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో మహమ్మారి పంజా దెబ్బకు రెండు జిల్లాల్లో వాన జాడ కరువైంది. ఆగస్టు దాటిపోతున్నా వరుణుడి కరుణ లేకుండా పోయింది. ఫలితంగా వ్యవసాయం, వ్యవసాయధారిత రంగాలన్నీ కుదేలయ్యాయి. జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగు, పశుగ్రాసం కొరత, తాగునీటి ఎద్దడి, జీవనోపాధి లేక వలస బాట పట్టిన కూలీలను ఆదుకోవడం తదితర ప్రధాన అంశాలపై సభ్యులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాగేందుకు నీళ్లు ఇవ్వండి

సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యను తీర్చాలంటూ ప్రజలు ఇటీవల రోడ్లెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సర్వసభ్య సమావేశంలో తాగునీటి సమస్యపై పూర్తిస్థాయిలో చర్చిస్తే తప్ప ప్రజల దాహార్తి తీరే పరిస్థితులు కనిపించడం లేదు.

వీటిపైనా దృష్టి సారించండి..

రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక కొత్త పెన్షన్ల మంజూరు సంగతి ఏమో గానీ ఉన్న వాటిలోనే వివిధ కారణాలు చూపుతూ పేదల పొట్ట కొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేకుండా పోయింది. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను చంద్రబాబు ప్రభుత్వం పేదల నుంచి దూరం చేస్తుందన్న సంగతి బహిరంగ రహస్యమే. సభ్యులు ఈ అంశాలపై చర్చించి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చినప్పుడే ఇలాంటి సభల సమావేశాలకు సార్థకత చేకూరే అవకాశం ఉంది.

జిల్లావ్యాప్తంగా విపత్కర పరిస్థితులు

రోడ్డెక్కినా తీరని దాహం కేకలు

సాగునీటి కోసం అన్నదాతల తహతహ

కనుచూపు మేరలో కనిపించని

సహాయక చర్యలు

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

సాగు నీరివ్వాలి

హెచ్‌ఎల్‌సీ కింద ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలి. లేకుంటే ఎకరాకు రూ. 50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలి. హంద్రీ–నీవా నుంచి వచ్చే నీటిలో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలు కేటాయించాలి. ప్రతి గ్రామంలో దళితులకు శ్మశాన స్థలం కేటాయించాలి. కాలనీల్లో తాగునీరు, మురికి కాలువలు, రోడ్లు, వీధి దీపాలు తదితర సౌకర్యాలు కల్పించాలి. డప్పు, చర్మకారులు, ఉరుముల కళాకారులకు, కాటికాపర్లకు ఫించన్‌ ఇవ్వాలి. శ్రీరామిరెడ్డి వాటర్‌ వర్కర్స్‌కు బకాయి వేతనాలు, పీఎఫ్‌, ఈఎస్‌ఐ ఇవ్వాలి.

– ఒడ్డుపల్లి నల్లప్ప,

సీపీఎం అనంతపురం జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement