మడకశిర: ఎల్‌నినో ప్రభావంతో ఈ సీజన్‌లో తీవ్ర వర్షాభావం ఏర్పడింది. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలల గడుస్తున్నా సరైన వర్షం కురవలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా భూగర్భజలం అడుగంటి పోయింది. ముఖ్యంగా మడకశిర నియోజకవర్గంలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఉద్యాన తోటలు ఎక్కువగా సాగుచేసే మడకశిర రైతులు బోరుబావులపై ఆధారపడ్డారు. వర్షాలు సమృద్ధిగా వస్తే భూగర్భజలమట్టం పెరిగి బోర్లులో నీరు పుష్కలంగా ఉండేది. ఈసారి సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో బోర్లన్నీ ఎండిపోగా, రైతు పరిస్థితి ఆగమ్యగోచరమైంది.
దిష్టిబొమ్మలా మారిన బోర్లు..
నియోజకవర్గంలో పంటల సాగుకు రైతులు వేసుకున్న బోర్లు 28 వేల వరకు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే కొన్ని ఎండిపోయాయి. మరికొన్ని బోరు బావుల్లో నీటి లభ్యత తగ్గి పోయింది. భూగర్భ జలం ఇంకి పోతుండడంతో ఉన్న ఫళంగా నీరు రావడం నిలిచిపోతోంది. దీంతో పొలంలో బోరు ఉన్నా...దిష్టిబొమ్మలా దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో వక్క, దానిమ్మ, మల్బరీ తదితర పంటలను కాపాడుకోవడానికి రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
కొత్తబోర్లు.. పెరుగుతున్న అప్పులు..
ఇప్పటికే వేసిన బోర్లు ఎండిపోగా, పంటలు కాపాడుకునేందుకు రైతులు నూతన బోర్లు వేస్తున్నారు. ఇందుకోసం భారీగా అప్పులు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో వేలాది మంది రైతులు నూతన బోర్లు వేయించారు. అయితే 100 బోర్లు వేస్తే అందులో 80 బోర్లలో నీళ్లు పడటం లేదు. మిగిలిన 20 బోర్లలోనూ నామమాత్రంగా నీరు వస్తోంది. ఒక్కో రైతు తన అవసరాన్ని బట్టి ఒకటి నుంచి 5 వరకు బోర్లు వేయించి రూ.లక్షలు నష్ట పోయారు.
ఒక్కో బోరుకు రూ.7 లక్షల వరకు ఖర్చు..
కొత్తగా బోరువేసి మోటరు బిగించి నీళ్లు పారించాలంటే ఒక్కోబోరుకు సుమారుగా రూ.7 లక్షల వరకు ఖర్చు వస్తోంది. ప్రధానంగా బోరు తవ్వకానికి అడుగుల ప్రకారం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 300 వరకు అడుగుకు రూ.130 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి 100 అడుగులకు ధర పెరుగుతుంది. 1,000 అడుగుల మేర బోరు తవ్విస్తే రూ.2.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. నీరు పడితే మోటార్, పైపులు, కేబుల్ వాటికి మరో రూ.4.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. మొత్తంగా ఒకబోరు వేస్తే రూ.7 లక్షల వరకు ఖర్చు పెట్టాల్సి వస్తోందని రైతు చెబుతున్నారు. ఇంతచేసినా నీరు పడకపోవడంతో బోరుకోసం చేసిన అప్పులు తీర్చేందుకు రైతులు కుటుంబాలతో వలస బాట పట్టారు.
వర్షాభావం.. అడుగంటిన భూగర్భజలం
ఎండిపోయిన వేలాది బోరుబావులు
పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు
కొత్తగా బోర్లు వేయిస్తున్నా... నీళ్లు పడని వైనం
బోర్లకే రూ.లక్షలు ఖర్చు చేస్తున్న అన్నదాతలు
అప్పులు తీర్చేందుకు కుటుంబాలతో వలసబాట


