హిందూపురం: ‘‘గణేష్ ఉత్సవాల్లో మతసామరస్యాన్ని చాటుదాం. ఉమ్మడి జిల్లాకు స్ఫూర్తిగా నిలుద్దాం. మండపంలో వినాయకుడిని కొలువుదీర్చిన రోజు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకూ అందరూ నిబంధనలు పాటించాలి. శాంతియుత వాతావరణంలో ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి’’ అని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఏఎస్పీ అంకితా సురానా పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక గుడ్డం కల్యాణ మండపంలో హిందూపురం ఏఎస్పీ కేవీ మహేష్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల అధికారులు, పోలీసు శాఖ ఉన్నతాధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, నిర్వాహకులతో గణేష్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై విస్తృత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్, ఏఎస్పీ మాట్లాడుతూ...ప్రతి ఉత్సవ కమిటీ ప్రభుత్వం, పోలీసు శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధిత శాఖల నుంచి ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. విగ్రహ ప్రతిష్టాపన, నిమజ్జన కార్యక్రమాలను నిర్ణీత సమయాల్లోనే నిర్వహించాలని, శోభాయాత్రలోనూ శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఊరేగింపులో డీజేలు, అధిక శబ్ధంతో కూడిన సౌండ్ సిస్టమ్‌లకు అనుమతి లేదన్నారు. రహదారుల్లో ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. షార్ట్ సర్క్యూట్‌లకు తావులేకుండా విద్యుత్తు సరఫరా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి మండపం వద్ద అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన భద్రతా పరికరాలు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రతి మండపం వద్ద పారిశుధ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు..
మత సామరస్యానికి భంగం కలిగించే వ్యాఖ్యలు, నినాదాలు, కార్యక్రమాలు మండపాల వద్ద నిర్వహించకూడదని ఏఎస్పీ అంతికా సురానా తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర సమయంలో మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. శోభా యాత్రలో మద్యం సేవించడం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడడం, శాంతిభద్రతలకు భంగం కల్గించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. పోలీసు శాఖ సూచించిన మార్గం, సమయంలోనే నిమజ్జనం జరగాలన్నారు. సమావేశంలో జిల్లా రవాణా అధికారి కరుణసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, సీఐలు అబ్దుల్ కరీం, జనార్దన్, రాజగోపాల్ నాయుడు, ఆంజనేయులు, ఎస్‌ఐ రాజేష్‌తోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, పట్టణ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
మతసామరస్యం చాటి
ఇతరులకు స్ఫూర్తిగా నిలుద్దాం
హిందూపురం గణేష్ మండపాల నిర్వాహకులకు జేసీ, ఏఎస్పీ పిలుపు
శోభాయాత్రలో డీజేలకు
అనుమతి లేదని వెల్లడి


