● వ్యవసాయ శాఖ అధికారుల సూచన
పుట్టపర్తి అర్బన్: ‘‘వర్షాలు లేక అదును దాటిపోయింది.. ఇక వేరుశనగ జోలికి వెళ్లకండి. ఇప్పుడు పంట వేసినా దిగుబడి రాదు. వర్షాలు కురిసినా ప్రత్యామ్నాయ పంటలైన కొర్ర, పెసర, సజ్జ, జొన్న పంటలు సాగుచేయండి’’ అని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ సభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లి రైతు సేవా కేంద్రంలో రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు లాంఫాం నుంచి విచ్చేసిన డాక్టర్ సంపత్ కుమార్, ఏరువాక జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఖరీఫ్‌లో ఇప్పటికే వేరుశనగ, కంది, ఆముదం తదితర పంటలను సాగు చేసిన రైతులు బెట్ట తగలకుండా సాళ్ల మధ్యలో గడ్డిని పూర్తిగా తొలగించడంతో పాటు మొక్కల సంఖ్యను తగ్గించాలన్నారు. పంటలు పూర్తిగా ఎండిపోకుండా ఉండేందుకు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపి పంటలపై పిచికారీ చేసుకోవాలన్నారు. సదస్సులో తాడిపత్రి వ్యవసాయ కళాశాల అధికారులు మల్లేశ్వరి, భార్గవ్ రామిరెడ్డి, ఏఓ సతీష్, ఏఈఓ సునీత, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. అంతకుముందు బుక్కపట్నం మండలం మారాల, క్రిష్ణాపురం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యామ్నాయ పంటు వేసుకోవాలని సూచించారు.
‘టెట్’కు తొలిరోజు
12 మంది గైర్హాజరు
● జిల్లా అభ్యర్థులకు
బెంగళూరు సెంటర్‌లో పరీక్ష
పుట్టపర్తి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు బెంగళూరులోని ఐయాన్ డిజిటల్ జోన్ సెంటర్‌లో నిర్వహించిన పరీక్షలకు 46 మందికి గాను 34 మంది హాజరయ్యారని, 12 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన తొలి సెషన్‌లో 27 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 12 మంది హాజరైనట్లు ఆయన వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలకుండా పరీక్ష కేంద్రంలో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు డీఈఓ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించామని వెల్లడించారు.


