రూ.6 లక్షలు ఖర్చయ్యింది
నేను ఏడు ఎకరాల్లో టమాట, వంకాయ సాగు చేశా. ఇందుకు రూ.6 వరకూ పెట్టుబడి అయ్యింది. నెలన్నర నుంచి కోతలు కోస్తూ మార్కెట్‌కు తరలిస్తున్నా. గిట్టుబాటు ధర రావడం లేదు. ఇప్పటి వరకూ రూ.లక్ష చేతికందింది. కానీ కూలీలకు, పంట రవాణాకు నెలకు రూ.1.50 లక్షల ఖర్చు అవుతోంది. నారు నుంచి మొదలిపెడితే కలువుతీత, మందులు, ఎరువులకు చాలానే ఖర్చు చేశా. ధరలు ఇంత అధ్వానంగా పడి పోవడం గతంలో ఎప్పుడూ లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. – నారాయణస్వామి, గోరంట్ల
చెట్లలోనే వదిలేశా
టమాటకు గిట్టుబాటు ధరలు లేవు. పంటను మార్కెట్‌కు తీసుకువెళ్తే కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడంలేదు. కాయలు నాణ్యంగా ఉన్నా...ఎవరూ కొనుగోలు చేయడం లేదు. అందుకే కాయలను చెట్లపైనే వదిలేశా. ఇలాగైతే రైతులు ఎప్పుడు బాగుపడతారు.
– జనార్దన్‌రెడ్డి, పెడపల్లి
పుట్టపర్తి అర్బన్: సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పిన చాలా మంది జిల్లా రైతులు కూరగాయల పంటలు సాగుచేస్తున్నారు. సమీపంలోని బెంగళూరు మెట్రో సిటీతో పాటు చిక్‌బళ్లాపూర్, బాగేపల్లి, డీ క్రాస్ మార్కెట్‌లకు కూరగాయలను తరలించి పంటలను విక్రయించేవారు. గతంలో కాస్తాకూస్తో లాభాలు వచ్చేవి. కానీ రెండేళ్లుగా సరైన వర్షాలు కురవక, తెగుళ్లు సోకి దిగుబడి భారీగా తగ్గింది. మరోవైపు మార్కెట్‌లో పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మూడు నెలల నుంచి ధరలు అమాంతం పడిపోవడంతో చాలా మంది రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారు.
టమాటకు రవాణా చార్జీలు రాక...
ప్రసుత్తం టమాట 15 కిలోల బాక్సు మొదటి రకం రూ.130 పలుకుతుండగా.. రెండు, మూడో రకం టమాట 15 కిలోల బాక్సు రూ.70 నుంచి రూ.80 మధ్య పలుకుతున్నాయి. ధర అమాంతం తగ్గడంతో కూలీ ఖర్చులు, రవాణా చార్జీలు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. తోటలో వదిలేస్తే రోగాలు వ్యాప్తి చెందుతాయని కాయలు కోసి మార్కెట్‌కు తరలిస్తుంటే తీవ్ర నష్టాలు వస్తున్నాయంటున్నారు.
కూలీల ఖర్చు కూడా
రావడం లేదు..
వంకాయ 10 కిలోల బస్తా రూ.100 నుంచి రూ.120 వరకూ పలుకుతున్నాయి. వీటిని కోసి, గ్రేడింగ్ చేసి మార్కెట్‌కు తరలిస్తే పెట్టుబడి రాక పోగా కూలీలకు కూడా చేతినుంచి ఇవ్వాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. వాతావరణం అనుకూలించక వంకాయకు తెగుళ్లు సోకి కాయలన్నీ రంధ్రాలు పడ్డాయని, దీంతో మార్కెట్‌కు తీసుకు వెళ్లినా ఎవరూ కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే చాలా మంది వంకాయలను కోసి పారబోస్తున్నారు.
తెగుళ్లతో తగ్గిన కూరగాయల పంటల దిగుబడి
అరకొర పంటకూ మార్కెట్‌లో దక్కని గిట్టుబాటుధర
కూలీల ఖర్చులు కూడా గిట్టక పొలంలోనే వదిలేస్తున్న రైతులు


