పుట్టపర్తి అర్బన్: జిల్లాలోని 12 మండలాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకూ తుంపర వర్షం కురిసింది. అత్యధికంగా అమరాపురం మండలంలో 16.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే లేపాక్షి మండలంలో 8 మి.మీ, అమడగూరు 7.8, చిలమత్తూరు 6.8, రొళ్ల 5.4, సోమందేపల్లి 4.8, గుడిబండ 3.4, బత్తలపల్లి 2.2, నల్లచెరువు 2.2, రొద్దం 1.6, మడకశిర 1.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. మొత్తంగా 65.6 మి.మీ వర్షపాతం నమోదైనట్లు చెప్పారు.
‘స్కిల్ కాంపిటీషన్’ను
సద్వినియోగం చేసుకోండి
ప్రశాంతి నిలయం: యువతలో దాగి ఉన్న వృత్తి నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఇండియా స్కిల్స్ కాంపిటీషన్స్–2026’ను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను జాతీయ వేదికలపై ప్రదర్శించడానికి ఇదో మంచి అవకాశమన్నారు. విజేతలకు నగదు బహుమతులతో పాటు, జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తారన్నారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇతర సంప్రదాయ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు tinyurl.com/indiaskill లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.


