ధర్మవరం అర్బన్: ఈవీఎంలు భద్రత పరచిన గోడౌన్‌పై ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ సిబ్బందిని ఆదేశించారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆయన పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఈవీఎంలు భద్రపరచిన గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈవీఎం యంత్రాలు, వీవీ ప్యాట్‌లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ వద్ద సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ, భద్రతా నిరంతరం ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాంభూపాల్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉన్నారు.
రైతులకు న్యాయమైన
పరిహారం ఇవ్వాలి
● కలెక్టర్‌ను కోరిన మాజీ ఎమ్మెల్యే
దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
ప్రశాంతి నిలయం: భారత రక్షణ రంగ సంస్థ (డీఆర్‌డీఓ) చేపడుతున్న ప్రాజెక్ట్‌కు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కలెక్టర్ శ్యాం ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ నేతలతో కలిసి కలెక్టర్‌ను వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పుట్టపర్తి కేంద్రం శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసిందని, దీంతో ఈ ప్రాంతంలోని భూముల ధరలు బాగా పెరిగాయన్నారు. 2021 సంవత్సరంలో ఇదే ప్రాంతంలో ఎన్‌హెచ్–342 కోసం భూ సేకరణ చేయగా, అప్పటి జగన్ సర్కార్ ఎకరాకు రూ.32 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పరిహారం ఇచ్చిందని గుర్తు చేశారు. గత ఐదేళ్లలో మార్కెట్ విలువలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకు అనుగుణంగా డీఆర్‌డీఓ ప్రాజెక్ట్‌కు భూములు కోల్పోతున్న రైతులకు పరిహారం అందించాలని కోరారు.
మెరుగైన వైద్యసేవలు
అందించాలి
మడకశిర: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్యాధికారి ఫైరోజా బేగం సూచించారు. ఆమె శుక్రవారం పట్టణంలోని అర్బన్ పీ హెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అన్ని లక్ష్యాలను అధిగమించాలని కోరారు. నాణ్యమైన వైద్య సేవలందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సంపూర్ణ టీకా కార్యక్రమం, మలేరియా నియంత్రణ, లార్వా సర్వే , డ్రై డే, రికార్డుల నిర్వహణ, అధిక ప్రమాద గర్భిణుల గుర్తింపు తదితర అంశాలపై ఆమె సమీక్షించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మంజువాణి, జిల్లా కోఆర్డినేటర్ శ్రీదేవి, డాక్టర్ పద్మజ, డీపీఎంఓ నాగరాజు, సీహెచ్‌ఓ వరప్రసాద్, ఎంపీహెచ్‌ఈఓ గఫూర్, డాక్టర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
నిషేధిత భూముల
పరిష్కార బాధ్యత ఆర్డీఓలదే
ప్రశాంతి నిలయం: నిషేధిత జాబితా(22–ఏ)లో చేరిన భూముల పరిష్కార బాధ్యతను ఇక నుంచి ఆర్డీఓలు చూస్తారని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం ఆయన రెవెన్యూ, రీ సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం, రీ సర్వే ప్రగతి, కలుగుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ అందిన 22– ఏ పెండింగ్ క్లెయిమ్‌లను రెండు వారాల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఈ అంశంపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. రీ సర్వే పనుల్లో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.


