ప్రశాంతి నిలయం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం తర్వాత జిల్లాలో ఏకంగా 1.7 లక్షల ఓట్లు తగ్గాయి. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్యాంప్రసాద్ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేశారు. ఇందులో ‘సర్’కు ముందున్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 1,70,584 మంది ఓటర్లు తగ్గారు. అయితే అర్హులై ఉండి ముసాయిదా జాబితాలో పేర్లులేని వారికి మరో అవకాశం కల్పించారు. ఈ అవకాశాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారన్నది సందేహంగా మారింది.
45 రోజుల పాటు సాగిన ‘సర్’ ప్రక్రియ..
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమం జిల్లాలో జూన్ 15 నుంచి జూలై 24 వరకు 45 రోజుల పాటు సాగింది. బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఇచ్చి పూర్తి చేసిన వాటిని స్వీకరించి డిజిటలైజేషన్ చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల హేతుబద్ధ్దీకరణ ప్రక్రియ నిర్వహించారు. అర్హులైన నూతన ఓటర్లను గుర్తించి వారి వివరాలను సేకరించారు. ఎన్యుమరేషన్ ఫారాలు అందించని వారి ఓట్లు తొలగించి జూలై 31న ఓటరు ముసాయిదా జాబితాను అధికారికంగా ప్రకటించారు. ప్రజలు తమ వివరాలను పరిశీలించి అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు చేసుకునేందుకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల, స్థానిక ప్రభుత్వ కార్యాలయాల వద్ద ముసాయిదా ఓటరు జాబితాను అందుబాటులో ఉంచారు.
నమోదుకు మరో అవకాశం..
ఓటరు జాబితాలో ఓటరుగా నమోదు, తొలగింపు, వివరాల మార్పునకు సంబంధించి క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై అందే అర్జీలను ఈ నెల 30వ తేదీ వరకు స్వీకరిస్తారు. అర్హులై ఉండి ప్రస్తుతం ప్రచురించిన ఓటర్ల ముసాయిదాలో ఓటు లేని వారితో పాటు వయసు 18 ఏళ్లు నిండినవారు కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. వచ్చిన క్లెయిమ్‌లను, అభ్యంతరాలను సెప్టెంబరు 28వ తేదీలోగా పరిష్కరిస్తారు. అక్టోబరు 3వ తేదీన ఓటర్ల తుదిజాబితా ప్రచురిస్తారు. అర్హులై ఉండి ముసాయిదా జాబితాలో పేరులేని ఓటర్లు తమ పరిధిలోని బీఎల్‌ఓలను సంప్రదించి ఎన్యుమరేషన్ ఫారాన్ని సమర్పించాలని ఆధికారులు సూచిస్తున్నారు.
కొంప ముంచారు ‘సర్’
ముసాయిదా ఓటరు జాబితా
ప్రకటించిన కలెక్టర్
జాబితా నుంచి 1,70,584 ఓట్ల తొలగింపు
ఈ నెల 30వ తేదీ వరకు
అభ్యంతరాలపై అర్జీల స్వీకరణ
అక్టోబర్ 3న తుది ఓటరు జాబితా విడుదల


