కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్ డ్యాం)కు ఇన్‌ఫ్లో ఉండడంతో నీటి మట్టం పెరుగుతోంది. ఆదివారం నాటికి డ్యాంలో 4.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ – నీవా కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తోంది. కాగా తాగునీటి అవసరాలకు రోజూ 55 క్యూసెక్కులు, లీకేజీ, నీటి ఆవిరి రూపంలో మరో 55 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.
శభాష్ ‘సోనాక్షి’
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలో నివాసముంటున్న వేణుగోపాల్, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షి స్కేటింగ్‌లో సత్తా చాటినట్టు కోచ్ నాగేంద్ర తెలిపారు. బీకేఎస్‌కు చెందిన ఆరేళ్ల చిన్నారి సోనాక్షి 1వ తరగతి చదువుతోంది. ఇటీవల 38వ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్‌లో రెండు రజత పథకాలు కై వసం చేసుకుందని, వచ్చే నవంబర్‌లో కాకినాడ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలలో పాల్గొంటుందని కోచ్ తెలియజేశారు. ప్రతిభ కనబరిచిన చిన్నారిని కోచ్ నాగేంద్ర, హేమంత్, అఖిల్, తల్లిదండ్రులు వేణు, మౌణికలు అభినందించారు.
చిరుత దాడిలో మేక మృతి
కూడేరు: చిరుత దాడిలో మేక మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని అంతరగంగ సమీపంలో నున్న కాకరకొండ అటవీప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు.. అంతరగంగ గ్రామానికి చెందిన మల్లికార్జున మేకల మందను కాకరకొండ వద్ద మేపుతుండగా చిరుత పులి అకస్మాత్తుగా దాడి చేసి ఓ మేక పిల్లను గుండ్రాళ్ల మధ్యకు పట్టుకెళ్లినట్టు చెప్పాడు. కాగా 20 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుత సంచరించినట్టు స్థానికులు తెలిపారు. చిరుత సంచారంతో పశువులు, జీవాల కాపరులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత బెడద తప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


