కదిరి టౌన్: ఈజీ మనీ కోసం దొంగగా మారాడో బేల్దారి. ఇందులో భాగంగానే వృద్ధులను నమ్మించి బంగారు ఉంగరాలు, జనసందోహంలో బంగారు చైన్లు దోచుకుంటున్న అంతర్ జిల్లా దొంగ భార్గవ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ ఆదివారం కదిరి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లాతో పాటు అనంతపురం, అన్నమయ్య జిల్లాలో ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకొని భార్గవ్ వరుస దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కదిరిలోని హిందూపురం రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన భార్గవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి దాదాపు 140 గ్రాముల బంగారు, స్కూటర్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.20 లక్షల దాకా ఉంటుంది.
ఒంటరి వృద్ధులే టార్గెట్
అంతర్ జిల్లా దొంగ బి.భార్గవ్‌ది జిల్లాలోని హిందూపురం పట్టణంలోని శ్రీకంఠాపురం. గతంలో బేల్దారి పనులు చేసుకుంటూ మేస్త్రీగానూ కొనసాగేవాడు. అయితే వచ్చే డబ్బు సరిపోక సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. ఎక్కవగా రోడ్లు, బస్టాప్‌లు, గుడుల వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధులను పలకరిస్తూ నమ్మించి, బలవంతంగా వృద్ధుల నుంచి ఉంగరాలు లాక్కెళ్లేవాడు. భార్గవ్‌పై జిల్లాలో 10, అనంతపురం జిల్లాలో 2, అన్నమయ్య జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి. 140 గ్రాముల బంగారు, నాలుగు చైన్లు, 11 ఉంగరాలు, చెవికమ్మ వంటివి స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని కదిరి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఆదేశాలమేరకు రిమాండ్‌కు తరలించారు. 13 కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి, పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు, ఎస్.ధనుంజయ్‌రెడ్డి, క్రైమ్ టీమ్ కానిస్టేబుళ్లు దేవేంద్ర, రమణ, రెడ్డప్ప, హుస్సేన్, సుదర్శన్, శంకర్‌రెడ్డిని ఎస్పీ అభినందించారు.
3 జిల్లాల్లోని 8 పోలీస్‌స్టేషన్లలో
13 కేసుల ఛేదన
140 గ్రాముల బంగారం, స్కూటర్ స్వాధీనం


