వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

వ్యాధులను నిర్లక్ష్యం చేయొద్దు

Oct 5 2026 12:57 AM | Updated on Oct 5 2026 12:57 AM

హిందూపురం టౌన్‌: మారుతున్న జీవనశైలి, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామానికి దూరమవడం, మానసిక ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం వంటి కారణాలతో చిన్న వయసులోనే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గతంలో వయసు పైబడిన వారిలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ వ్యాధులు ప్రస్తుతం యువతలోనూ బయటపడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఒక్కసారి వచ్చిందంటే...

30 ఏళ్లకే బీపీ, షుగర్‌ ముప్పేట దాడి చేయడం వెనుక యువత వ్యాయామానికి దూరంగా ఉండడం, ఉరుకుల పరుగుల జీవితంలో సమయానికి సరైన ఆహారం తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడికి గురికావడం, సరైన నిద్ర, తగిన విశ్రాంతి లేకపోవడం వంటి కారణాలు ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. చిన్న వయసులోనే మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారినపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి బీపీ, షుగర్‌ వంటి వ్యాధులు దరిచేరితే వాటిని అదుపులో ఉంచుకునేందుకు జీవితాంతం మందులు వాడాల్సి రావడంతో పాటు సరైన వ్యాయామం, ఆహార నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

పెరుగుతున్న బాధితులు

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఎన్‌సీడీ సర్వేలో మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్యను తెలుసుకుంటున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ పథకంలో భాగంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆస్పత్రుల్లో బీపీ, షుగర్‌ పరీక్షలు చేస్తుండగా, వాటి బారిన పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతోందని సర్వేలో తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో జిల్లాలో మధుమేహం ఉన్నవారు 48 వేల మంది, రక్తపోటు (బీపీ) ఉన్నవారు 71 వేల మంది ఉన్నట్లు గుర్తించారు. బీపీ, షుగర్‌ బారిన పడిన వారి వివరాలను వెబ్‌పోర్టల్‌లో నమోదు చేసి ఏసీడీ కార్డు ఇస్తున్నారు. ఏసీడీ కార్డులో పేషెంట్‌ పేరు, అందిస్తున్న చికిత్స, మందుల వివరాలు పొందుపర్చి, ప్రతినెల ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల ద్వారా వారికి మందులు అందిస్తున్నారు.

మందులు కరువు

జిల్లా వ్యాప్తంగా మధుమేహం, రక్తపోటు కలిగిన దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారికి పూర్తి స్థాయిలో మందులను అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమవుతోంది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక, పట్టణ, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలను మాత్రమే నిర్వహిస్తున్నారు. వ్యాధులు నిర్ధారణ జరిగిన తరువాత రోగులకు అందించేందుకు సరిపడా మందులు ఉండడం లేదన్న విమర్శలున్నాయి. చాలా ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యులు మాత్రలను బయటికి రాసి ఇస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సరిపడా మందులు ఉండడం లేదు. తక్కువ మొత్తంలోనే మందులు అందుతున్నాయని రోగులు చెబుతున్నారు.

హిందూపురానికి చెందిన 32 ఏళ్ల ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. తలనొప్పి కారణంగా ఆస్పత్రికెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాడు. రక్తపోటు ఎక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. ఉద్యోగంలో తీవ్ర మానసిక ఒత్తిడితో పాటు తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా బీపీ వచ్చినట్లు తెలుసుకున్నాడు. చిన్న వయసు నుంచి బీపీ మాత్రలు మింగుతూ ఎన్నాళ్లిలా అంటూ.. కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే ఉద్యోగం మానేయాలని చెప్పారు.

పుట్టపర్తికి చెందిన 27 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ వారం రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. పలు వైద్య పరీక్షల అనంతరం షుగర్‌ లెవెల్స్‌ ఎక్కువగా ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆహారపు అలవాట్లు మార్చుకోవడంతో పాటు రోజూ శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేస్తేనే నియంత్రణలో ఉంటుందని సూచించారు. కనీసం 30 ఏళ్లు కూడా నిండని వయసులోనే షుగర్‌ రావడం ఏంటని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.

మూడు పదుల వయసులోనే బీపీ, షుగర్‌

జిల్లాలో 30 ఏళ్లకే పెరిగిపోతున్న బాధితులు

71 వేల మందికి బీపీ,

48 వేల మందికి షుగర్‌

సరిపడా మందులు అందించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement