ధర్మవరం రూరల్: మామిడి రైతులు పంట దిగుబడిపై ఆశలు పెట్టుకుంటున్నారు. ఇందులో భాగంగా మామిడి తోటల్లో ముందస్తు పూతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది రైతులు తోటల్లో దుక్కులు దున్ని ఎరువులను వేసుకుంటున్నారు. ప్రస్తుతం వర్షాభావంతో బోరు బావుల్లో నీరు అడుగంటి పోతోంది. సరిగ్గా మార్చి, ఏప్రిల్ నెలల్లో పంట చేతి కందుతుంది. అయితే అప్పటి దాకా బోరు బావుల్లో నీరు వస్తుందో రాదోనని ఇప్పటి నుంచే రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితం పదునైన వర్షం కురవడంతో మామిడి చెట్లు చిగుర్లు వేస్తున్నాయి. మరో 20 రోజుల్లో పూతలు కనిపించే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మామిడి రైతులు పంటపై ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్నారు. దీంతో పంట సాగు కోసం లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు.
38,594 ఎకరాల్లో...
జిల్లాలో 38,594 ఎకరాలలో మామిడి పంట సాగవుతోందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో అత్యధికంగా బుక్కపట్నం మండలంలో 3,594 ఎకరాల్లో సాగవుతోంది.
తోటల్లో ముందస్తు పూత కోసం ప్రయత్నాలు
వర్షాభావంతో బోరు బావుల్లో అడుగంటుతున్న నీరు
ఆందోళన పడుతూనే పంట కోసం భారీగా పెట్టుబడులు
దుక్కులు చేస్తున్నాం
ఇటీవల వర్షం కురవడంతో మామిడి తోటల్లో దుక్కులు దున్నుకున్నాం. మామిడి తోటల్లో ముందస్తుగా పూతలు వస్తే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఆలస్యంగా పూతలు వచ్చి పంట దిగుబడి వస్తే మార్కెట్‌లో ఆశించిన మేర ఆదాయం లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.
– రమేష్, మామిడి రైతు, ఏలుకుంట్ల


