ప్రశాంతి నిలయం: తమకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి తగిన సమయంలో గుణపాఠం చెప్పితీరుతామని స్కీమ్ వర్కర్లు తేల్చి చెప్పారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ, ఆశా, మిడ్డేమీల్ వర్కర్లు శుక్రవారం ఎనుములపల్లి గణేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు మాట్లాడుతూ, స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి పార్టీల నేతలు...అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా పట్టించుకోలేదన్నారు. నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నా...అంగన్ వాడీ, ఆశా, మిడ్డే మీల్ వర్కర్ల వేతనాలు రూపాయి కూడా పెరగలేదన్నారు. పైగా పని మాత్రం పెరిగిందన్నారు. ఇప్పటికై నా మేల్కొని కనీస వేతనాల పెంపు, పెండింగ్ బిల్లులు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్‌ఐ, సంక్షేమ పథకాలు అమలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్‌లు, ఖాళీ పోస్టుల భర్తీ, రూ.10 లక్షల బీమా సౌకర్యం, సజావుగా వేతనాల చెల్లింపు వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోవు రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ శ్యాంప్రసాద్‌కు సమస్యలు వివరిస్తూ పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జీఎల్ నరసింహులు, జిల్లా అధ్యక్షుడు జెడ్పీ శ్రీనివాసులు, కోశాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా కార్యదర్శి గంగాద్రి, అంగన్ వాడీ, ఆశా, మిడ్డేమీల్స్ సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శులు యూ.శ్రీదేవి, సౌభాగ్యమ్మ, నారాయణ, ఆయా కమిటీల వర్కర్లులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హెచ్చరించిన స్కీమ్ వర్కర్లు
సమస్యల పరిష్కారం కోసం
కలెక్టరేట్ ఎదుట ధర్నా


