మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి లోకేష్‌ రాజీనామా చేయాలి

Aug 1 2026 1:37 AM | Updated on Aug 1 2026 1:37 AM

ప్రశాంతి నిలయం: డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్‌ సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలన్నారు. అర్హులైనప్పటికీ డీఎస్సీలో ఉద్యోగాలు దక్కని వారి తరఫున వైఎస్సార్‌ సీపీ పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే శుక్రవారం ధర్మవరం, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, పార్టీ హిందూపురం పార్లమెంట్‌ పరిశీలకుడు రమేష్‌రెడ్డి కలెక్టర్‌ను కలిశారు. మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

సమాధానం చెప్పలేక సవాళ్లు..

చంద్రబాబు ప్రభుత్వం మెగా పేరుతో దగా డీఎస్సీ నిర్వహించిందని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన తర్వాత కలెక్టరేట్‌ ఆవరణలో వారు మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ పేరుతో సీఎం, మంత్రులు అందినకాడికి దోచుకున్నారన్నారు. స్పోర్ట్స్‌ కోటా పేరుతో ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. డీఎస్సీ రాసి మోసపోయిన యువత అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌... ప్రతి పక్షంపై సవాళ్లు విసురుతున్నారన్నారు.

మొదటి ర్యాంకర్‌కు ఉద్యోగం ఇవ్వలేదు

డీఎస్సీలో మొదటి ర్యాంక్‌ సాధించిన అభ్యర్థికి ఉద్యోగం దక్కక పోవడం దేశ, రాష్ట్ర చరిత్రలో కూటమి హయాంలోనే సాధ్యమైందన్నారు. స్పోర్ట్స్‌ కోటా ద్వారా 441 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే రవి, విశాఖ ఎంపీ భరత్‌ చైర్మన్లుగా ఉన్న స్ట్పోర్ట్స్‌ కమిటీలతో అనర్హులకు ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయించి డీఎస్సీ, టెట్‌ రాయని వాళ్లకు ఉద్యోగాలిచ్చారన్నారు. ఒక్క స్పోర్ట్స్‌ కోటాలోనే ఇన్ని అక్రమాలు తేలాయని, ఇక డీఎస్సీ నియామకాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఇంకెన్ని అక్రమాలు బయటికి వస్తాయోన్నారు.

ఉద్యమ కార్యాచరణ..

మెగా డీఎస్పీ అక్రమాల పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైఎస్సార్‌సీపీ పోరాటం ఉధృతం చేస్తుందన్నారు. అందులో భాగంగా ఆగస్ట్‌ 3, 4 తేదీల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మేధావులు, విద్యావేత్తలతో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, ఆగస్ట్‌ 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు, 10వ తేదీన యువత, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పురుషోత్తం రాయల్‌, అమర్నాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలి

కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించిన వైఎస్సార్‌ సీపీ నేతలు

బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement