మడకశిర: నకిలీ బంగారు తాకట్టు పెట్టి స్థానిక కెనరా బ్యాంకు నుంచి రుణం పొందిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మడకశిర రూరల్ సీఐ రాజ్‌కుమార్, ఎస్‌ఐ కృష్ణారెడ్డి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే కీలక నిందితుడు గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
ఆడిటింగ్ సమయంలో
వెలుగు చూసిన మోసం..
మడకశిర కెనరా బ్యాంక్‌లో ఏడుగురు వ్యక్తుల పేరు మీద నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రూ.70.66 లక్షల రుణాలు పొందారు. బ్యాంక్‌లో పనిచేసే గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారి ఈ నకిలీ బంగారు తాకట్టు వ్యవహారంలో కీలకపాత్ర పోషించాడు. అయితే జూలై 25న బ్యాంకు ఆడిటింగ్‌లో అధికారులు నకిలీ బంగారు ఆభరణాలను కనిపెట్టారు. వెంటనే బ్యాంక్ ఏజీఎం శ్రీనివాసులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారితో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే కేసు నమోదు కాగానే సుందరేశ్‌చారి పరారయ్యాడు.
నకిలీ బంగారమా... మాకేం తెలీదు
గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారి దొరికితే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్వగ్రామంతో పాటు బంధువుల ఊళ్లలోనూ గాలించారు. ఎట్టకేలకు అతని జాడ కనుక్కొని రెండు రోజుల క్రితం అదుపులోనికి తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే బంగారు రుణాలు పొందిన ఏడుగురు ఖాతాదారుల్లో ఓ మహిళను పిలిపించి పోలీసులు విచారించగా... నకిలీ బంగారం విషయమే తనకు తెలియదని చెప్పినట్లు తెలుస్తోంది. తన పేరు మీద బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకుంటానని అప్రైజర్ చెప్పడంతో ఒప్పుకున్నానని సదరు మహిళ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మిగతా ఆరుగురు ఖాతాదారులు కూడా పోలీసులు విచారణలో ఇదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన నిందితుడు, గోల్డ్ అప్రైజర్ సుందరేశ్‌చారి పట్టుబడటంతో ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కొలిక్కి వస్తున్న నకిలీ బంగారు నగలు తాకట్టు కేసు
బంగారు నగలు తాకట్టు అంశమే తమకు తెలియదంటున్న ఖాతాదారులు


