ప్రశాంతినిలయం: శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన ఆలోచనలు పుడతాయని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్ అండ్ రైడ్–ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఉదయం 5.30 గంటలకు ఆర్‌జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండేలు లాంఛనంగా జెండా ఊపి రన్ అండ్ రైడ్‌ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మంజుందార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, హిమవాహినీ రత్నాకర్, కమలాపాండ్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ దేశంలోని 45 ప్రధాన నగరాల్లో ఇప్పటి వరకూ నిర్వహించిన రన్ అండ్ రైడ్‌లో 1.20 లక్షల మంది పాల్గొన్నారన్నారు. తాజాగా పుట్టపర్తిలో 19 వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్యసాయి బాబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవన విధానాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
● హిల్‌వ్యూ స్టేడియంలో ప్రారంభమైన 5కే రన్ అండ్ రైడ్ ఎనుములపల్లి గణేష్ సర్కిల్, పెట్రోలు బంకు, పెద్ద కమ్మవారిపల్లి రోడ్ మీదుగా తిరిగి హిల్‌వ్యూ స్టేడియం చేరుకుంది. దారి వెంబడి భక్తులకు ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు తీసుకున్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు.
సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు
పుట్టపర్తిలో ఉల్లాసంగా 5కే రన్ అండ్ రైడ్
గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రారంభం
ప్రశాంతినిలయం: గురుపౌర్ణమిని పురస్కరించుకుని పుట్టపర్తి ప్రశాంతినిలయంలో గ్లోబల్ మెడికల్ క్యాంప్‌ను ఆదివారం ప్రారంభించారు. ప్రశాంతినిలయంలోని నార్త్ –1 భవన్‌లో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్‌జే రత్నాకర్ రాజు సత్యసాయి బాబా చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు వైద్య శిబిరం కొనసాగు తుందన్నారు. దేశ విదేశాలకు చెందిన 70 మందికి పైగా వైద్యులు, 40 మంది పారామెడికల్ నిపుణులు, 80 మంది ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తారన్నారు. ఈఎన్‌టీ, గుండె జబ్బులు, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, కంటి, దంత వైద్యం, మానసిక ఆరోగ్యం, పిల్లల వైద్యం, పాదాల వైద్యం, మధుమేహంతో పాటు అవసరమైన ల్యాబ్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రత్నాకర్ రాజు కోరారు.


