పరిగి: భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలుగొందుతున్న బాలిరెడ్డిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉట్లమాను పరుష ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతసేవ, సహస్రనామార్చన, కుంకుమార్చన, ఆకు పూజలు చేపట్టారు. రైతులు ఎద్దుల బండ్లను విశేషంగా అలంకరించి ఊరేగింపుగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సాయంత్రం ఉట్లపరుష కోలాహలంగా సాగింది. ఉట్లమాను ఎక్కేందుకు యువకులు పోటీపడ్డారు. ఈ క్రమంలో వారు చేసిన విన్యాసాలు ఆసక్తి రేకెత్తించాయి. ఉత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.


