నేడు పరిష్కార వేదిక | - | Sakshi
Sakshi News home page

నేడు పరిష్కార వేదిక

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

ప్రశాంతినిలయం: మామిళ్లకుంట క్రాస్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారన్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించుకోవచ్చన్నారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్‌ చేయవచ్చన్నారు. meeskosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్‌, మునిసిపల్‌, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోలీస్‌ కార్యాలయంలో..

పుట్టపర్తి టౌన్‌: పోలీస్‌ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.

నేడు ఎస్కేయూ

పాలక మండలి సమావేశం

ఎజెండాలో లేని రిజిస్ట్రార్‌ నియామకం

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రార్‌ నియామకం జరిగింది. అయితే అసోసియేట్‌ ప్రొఫెసర్‌, డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో ఉన్న వారిని రిజిస్ట్రార్‌గా నియమించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా రీసెర్చ్‌ కమ్‌ స్టాటస్టికల్‌ ఆఫీసర్‌గా ఉన్న రమేష్‌బాబును నియమించడం విమర్శలకు తావిచ్చింది. ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఏకంగా రిజిస్ట్రార్‌ పదవిలోకి వచ్చి.. అధికార దుర్వినియోగానికి పాల్పడు తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పదవీ కాలం కూడా ముగుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌ నియామకంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చిస్తారని అందరూ భావించగా.. అజెండాలో ఆ అంశమే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

టీబీ డ్యాంలో

31 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం 31.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను 1,606.50 అడుగల మేర నీటిమట్టం ఉంది. ఇన్‌ఫ్లో 12,869 క్యూసెక్కులుండగా.. 3,561 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.43 అడుగులతో 77.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రధానితో చర్చలో

‘అనంత’ యువత

అనంతపురం అర్బన్‌: వికసిత్‌ వైబ్రెంట్‌ విలేజ్‌ కార్యక్రమంపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించిన చర్చావేదికలో అనంతపురం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 20 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వీరితో ప్రధాని ముచ్చటించారు. సరిహద్దు గ్రామాల్లో వారు పొందిన అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు కలెక్టర్‌ ఆనంద్‌ అభినందనలు తెలిపారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన వికసిత్‌ వైబ్రెంట్‌ విలేజ్‌ కార్యక్రమంలో జిల్లా తరఫున ప్రాతినిథ్యం వహించిన మైత్రి అనే అమ్మాయిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ‘మై భారత్‌ ప్రోగ్రాం’ సూపర్‌వైజర్‌ జి.శ్రీనివాసులు, కో–ఆర్డినేటర్‌ బిసాతి భరత్‌, ఆన్‌సెట్‌ మేనేజర్‌ సి.శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు బిసాతి జీవన్‌కుమార్‌, జయమారుతి, వలంటీర్లు అంబరీష్‌, రాము, సాయికార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement