ఎల్‌నినో పడగలో పాడి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో పడగలో పాడి

Jul 27 2026 2:06 AM | Updated on Jul 27 2026 2:06 AM

చిలమత్తూరు: ఎల్‌నినో మహమ్మారి జిల్లాపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు సైతం అడుగంటిపోతుండటంతో పంటల సాగు అంతకంతకూ తగ్గిపోతోంది. ఈ క్రమంలో పాడి రంగం కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పశుగ్రాసం కొరత, దాణా సరఫరాపై అనిశ్చితి నెలకొనడంతో వేలాది మంది పాడి రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 38.10 లక్షల పశువులు ఉన్నట్టు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రైతులు ఉద్యాన పంటల వైపు వెళుతుండటంతో గ్రాసం కొరత వేధిస్తోంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లోనే మేత లభిస్తుండగా, రానున్న రోజుల్లో అంతటా పరిస్థితి క్లిష్టంగా మారే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రాసం కొరతతో పాడి ఉత్పత్తి తగ్గడమే కాకుండా, పశువుల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం కమ్యూనిటీ ఫాడర్‌ డెవలెప్‌మెంట్‌ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టినా అది కాగితాల్లోనే కనిపిస్తోంది. అధికారులు కాన్ఫరెన్స్‌లకే పరిమితమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పశు సంవర్ధకశాఖ ద్వారా ఈ సారి దాణా పంపిణీ కూడా ఉండదని తెలిసింది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో పశు గ్రాసం కోసం రైతులు మరింత అల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రభుత్వం మొద్దునిద్ర

రెండు నెలలుగా ఎల్‌నినో దుష్ప్రభావంపై వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దునిద్ర పోతోంది. రాయితీతో సైలేజ్‌ గడ్డి, దాణామృతం (టీఎంఆర్‌) ఇవ్వడం లేదు. పశుదాణా (కాన్సట్రేటెడ్‌ క్యాటిల్‌ ఫీడ్‌) ఊసే లేదు. దీంతో పాడి రైతులు జీవాలను ఇతర ప్రాంతాలకు మేత కోసం తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. పరిస్థితి విషమించాక చివర్లో కంటితుడుపు చర్యలు చేపట్టినా ఫలితం ఉండదని రైతులు, కాపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంచుకొస్తున్న పశు గ్రాస సంక్షోభం

ముందస్తు చర్యలు చేపట్టడంలో

చంద్రబాబు ప్రభుత్వం విఫలం

తీవ్ర ఆందోళనలో రైతాంగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement