● పోలీసులకు ఎస్పీ ఆదేశం
గోరంట్ల: రౌడీ షీటర్లు, నేర చరితులు, వివిధ కేసుల్లో నిందితులుగా ఉండి బెయిల్‌పై బయట ఉన్న వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని ఎస్పీ సతీష్‌కుమార్ పోలీసులను ఆదేశించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే బైండవర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం ఆయన గోరంట్ల అప్‌గ్రేడ్ పోలీసు స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, లాకప్ గదులు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. పెండింగ్ కేసుల పురోగతి, సర్కిల్ పరిధిలో సమస్యాత్మక గ్రామాల తాజా పరిస్థితిని సీఐ శేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ...రాత్రి వేళ గస్తీ, బీట్ పోలీసింగ్, వాహన తనిఖీలను మరింత పటిష్టంగా నిర్వహించి నేరాలను నియంత్రించాలన్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల విక్రయం, రవాణా, వినియోగంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలు చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం గోరంట్ల ప్రధాన రహదారులను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఐ శేఖర్‌ను ఆదేశించారు.
వ్యవసాయానికి
నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి
● అధికారులకు ఏపీఎస్పీడీసీఎల్
సీజీఆర్‌ఎఫ్ చైర్మన్ ఆదేశం
బత్తలపల్లి: ‘‘దేశానికే అన్నం పెట్టే రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ముఖ్యంగా పంటల సాగులో కరెంటు కష్టాలు అస్సలు రానివ్వకూడదు. ఆ దిశగా విద్యుత్‌శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలి’’ అని ఏపీ ఎస్పీడీసీఎల్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చైర్మన్, విశ్రాంత జడ్జి వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి విద్యుత్ అధికారులకు సూచించారు. శుక్రవారం బత్తలపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పుట్టపర్తి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఆపరేషన్స్) శివరాములు అధ్యక్షతన ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస ఆంజనేయమూర్తి మాట్లాడుతూ..రైతులు, విద్యుత్ వినియోగదారుల సమస్యలను మానవత్వంతో అర్థం చేసుకుని పరిష్కరించాలన్నారు. అంతకుముందు బత్తలపల్లి, తాడిమర్రి, ధర్మవరం రూరల్ మండలాల్లోని విద్యుత్ వినియోగదారుల కోసం విద్యుత్ అదాలత్ నిర్వహించారు. 14 మంది తమ సమస్యలను విద్యుత్ అదాలత్ దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిని 15 రోజుల్లోపు పరిష్కరించాలని చైర్మన్ ఆదేశించారు. అదాలత్‌లో ఏపీఎస్పీ డీసీఎల్ ఆర్థిక సభ్యుడు మధుకుమార్, సాంకేతిక సభ్యుడు శ్రీనివాసబాబు, స్వతంత్ర సభ్యురాలు విజయలక్ష్మి, జిల్లా ఎస్‌ఈ మోసెస్, ఎస్‌ఏఓ బాలాజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
బైండోవర్ నిబంధనల
ఉల్లంఘనపై జరిమానా
చిలమత్తూరు: బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించి మరోమారు ఘర్షణకు దిగిన టి.నరేంద్ర అనే వ్యక్తికి రూ.50 వేలు భారీ జరిమానా విధించినట్టు సీఐ జనార్దన్, ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు. గతంలో భూ వివాదాల నేపథ్యంలో నరేంద్రను బైండోవర్ చేశామన్నారు. అయితే అతను మళ్లీ గొడవలకు దిగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుండడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నిందితుడికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని, నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోవడంతో రూ.50 వేలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు.


