పుట్టపర్తి అర్బన్: ఖరీఫ్ పంటల సాగు ఈసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా గుర్తింపు పొందిన జిల్లాలో ఉన్న కొద్దిపాటి నీటి వనరులతోనే రైతులు పంటల సాగు చేసేవారు. ఈ సారి ఎల్–నినో దెబ్బకు వర్షం జాడలేకుండా పోయింది. దీంతో అరకొర నీటి వనరులున్న వారంతా బిందు, తుంపర సేద్యానికి సిద్ధం కాగా, సర్కార్ మొండి చేయి చూపుతోంది.
బిల్లులు బంద్..ఆగిన రిజిస్ట్రేషన్లు..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూక్ష్మ సేద్యం కింద సబ్సిడీపై యూనిట్లు మంజూరు చేశారు. తొలి సంవత్సరం 11,988 హెక్టార్లకు, రెండో ఏడాది 14,305 హెక్టార్లు కలిపి ఇప్పటిదాకా 26,293 హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను అందజేశారు. మొదటి ఏడాది సుమారు రూ.118 కోట్లు, రెండో ఏడాది రూ.143 కోట్ల మేర ప్రభుత్వం ఆయా కంపెనీలకు చెల్లించాల్సి ఉండగా... నేటికీ నయాపైసా మంజూరు చేయలేదు. బకాయిలు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని ఆయా కంపెనీల ప్రతినిధులు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే జైన్, ఫినోలెక్స్, మెటాఫిన్ లాంటి పెద్ద కంపెనీలు ఈ ఏడాదిలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు. జిల్లాలోని 34 డ్రిప్పు కంపెనీల్లో పెద్ద కంపెనీలు ముందుకు రాకపోగా.... చిన్న చిన్న కంపెనీలు అరకొరగా రిజిస్ట్రేషన్లు ఇప్పుడిప్పుడే ప్రారంభించాయి.
గతమెంతో ఘనం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుకు ఎలాంటి కష్టం కలగకుండా చూశారు. విత్తు వేసే దగ్గర నుంచి పంట విక్రయించుకునే వరకూ రైతు వేసే ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచారు. ఈ క్రమంలోనే తన హయాంలో వేలాది మంది రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందించి వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చారు. వైఎస్సార్ సీపీ హయాంలో సుమారు 39,647 హెక్టార్లకు సరిపడా డ్రిప్పు, స్ప్రింక్లర్లకు సుమారు రూ.254.54 కోట్లు వెచ్చించారు. ఇందులో 10 శాతం రైతులు చెల్లిస్తే... 90 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. అలాగే జగన్ హయాంలో వరుణుడూ కరుణించడంతో సాగు పండుగలా సాగింది.
రైతు 10 శాతం చెల్లిస్తే చాలు..
ఏపీఎంఐపీ ద్వారా ప్రభుత్వం రైతులకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందజేసేది. రైతులు ముందుగా పది శాతం వాటా చెల్లిస్తే కంపెనీలు డ్రిప్పు, స్ప్రింక్లర్ పరికరాలను రైతుల పొలాల్లో అమర్చేవారు. అనంతరం రైతు పొలంలో అమర్చిన డ్రిప్పు, స్ప్రింకర్ల ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తే ప్రభుత్వం 90 శాతం మొత్తం ఆయా కంపెనీ ఖాతాల్లో జమ చేస్తుంది.
ఈ ఏడాది లక్ష్యం 14 వేల హెక్టార్లు..
ఈ ఏడాది ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ) ద్వారా 14 వేల హెక్టార్లకు డ్రిప్పు, స్ప్రింక్లర్లు అందించాలని లక్ష్యం పెట్టుకుంది. అయితే వీటిని సకాలంలో అందించడానికి కంపెనీలు ముందుకు వస్తాయా లేదా అనేది పెద్ద సందేహంగా మారింది. పెద్ద కంపెనీలు ముందుకు రాకపోవడంతో చిన్న కంపెనీలు వచ్చినా... నాసిరకం మెటీరియల్ అంటగడతారని రైతులు భయపడుతున్నారు. అంతేకాకుండా డ్రిప్పు పరికరాలు అందించడంలో భాగంగా డ్రిప్పు సిస్టం, ల్యాటర్, మూడు రకాల పీవీసీ పైపులు ఇస్తారు. అయితే ఈ ఏడాది నుంచి మెయిన్ లైనుకు వేసే రెండున్నర ఇంచి పీవీసీ పైపులు ఇవ్వడం మానేశారు. వీటికి ఖర్చు అధికమైందని కంపెనీ డీలర్లు వాపోతున్నారు. నాసిరకం ఇస్తే భూమిలోకి వేసిన తర్వాత పగిలి పోతే రైతులు ఇబ్బందులు పడతారని ఇవ్వడం లేదని ఓ డీలర్ చెప్పడం విశేషం. ఈ మేరకు రైతులు చెల్లించే మొత్తాన్ని తగ్గించామంటున్నారు.
బిందు, తుంపర సేద్యంపై నీలి నీడలు
అనావృష్టితో సూక్ష్మ సేద్యానికి
సిద్ధమైన రైతులు
రెండేళ్లుగా డ్రిప్పు కంపెనీలకు
బిల్లులు చెల్లించని సర్కార్
సామగ్రి అందించేందుకు
విముఖత చూపుతున్న కంపెనీలు
ఆగిన రిజిస్ట్రేషన్లు...
ఇబ్బంది పడుతున్న రైతులు
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ కకావికలమైంది. కీలకమైన సమయంలో వరుణుడి జాడలేక విత్తనం కూడా పడక పొలాలన్నీ తెల్లబోయాయి. కాస్తోకూస్తో నీటి వసతి ఉన్న రైతులు సూక్ష్మ సేద్యానికి సిద్ధం కాగా, సర్కార్ తీరుతో డ్రిప్పు కంపెనీలు సామగ్రి ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో
రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.


