టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు | - | Sakshi
Sakshi News home page

టీబీ డ్యాంలో 25 టీఎంసీల నీరు

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

బొమ్మనహాళ్‌: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్‌, అనంతపురం జిల్లా ప్రజలకు వరప్రదాయిని తుంగభద్ర జలాశయంలో 25.82 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, తీర్థనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుతున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులు కాగా, గురువారం నాటికి 1,603.12 అడుగలకు నీరు చేరింది. 105.788 టీఎంసీలకు గాను 25.82 టీంఎసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ప్లో 4,814 క్యూసెక్కులుండగా 522 క్యూసెక్కులు అవుట్‌ఫ్లోగా నమోవైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,626.06 అడుగులతో 80 టీఎంసీల నీరు నిల్వ ఉండి 40,117 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 29,607 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.

రెండు ఇసుక టిప్పర్లు సీజ్‌

ముదిగుబ్బ: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు కొరడా ఝుళిపించారు. సరైన పత్రాలు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను సీజ్‌ చేశారు. మండలంలోని చిత్రావతి నుంచి సాగుతున్న ఇసుక అక్రమ రవాణాపై రెండు రోజుల క్రితం ‘కూటమి చెర...చిత్రవధ’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీంతో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్టవేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో నే గురువారం మైనింగ్‌ శాఖ అధికారులు ముదిగుబ్బ – పుట్టపర్తి రహదారిపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రవాణా బిల్లులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను మైనింగ్‌ శాఖ సహాయ సంచాలకులు షేక్‌ అమీర్‌బాషా, రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ ఖాజావలి సీజ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌

రొళ్ల: చంద్రబాబు సర్కార్‌ భావప్రకటన స్వేచ్ఛను హరిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ నిరంకుశ పాలన సాగిస్తోంది. హామీలు అమలు చేయాలని సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించిన పలువురిని ఇప్పటికే జైళ్ల పాలు చేసింది. తాజాగా నియోజకవర్గంలోని ముగ్గురు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేశారు. రాజకీయాలు మాని.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలంటూ స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజును ప్రశ్నిస్తూ గుడిబండ ఎస్సీ కాలనీకి చెందిన భోజన్న సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు పెట్టారు. దాన్ని రొళ్ల మండలం రత్నగిరి గ్రామానికి చెందిన సురేష్‌తో పాటు జీజీ హట్టి గ్రామానికి చెందిన మంజునాథ్‌ షేర్‌ చేశారు. దీనిపై టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా ముగ్గురినీ గురువారం అరెస్టు చేసినట్లు మడకశిర రూరల్‌ సీఐ రాజ్‌కుమార్‌ తెలిపారు. కాగా, వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప తెలిపారు. అదేవిధంగా వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ విభాగం సంయుక్త కార్యదర్శి, రొళ్ల జెడ్పీటీసీ బి.అనంతరాజు కూడా అక్రమ అరెస్టును ఖండించారు. పార్టీ తరఫున వారికి అండగా ఉంటామన్నారు.

అగ్నివీర్‌ పోస్టులకు

దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం అర్బన్‌: భారత వైమానిక దళంలో ఎయిర్‌మెన్‌ (మేడ్‌ అసిస్టెంట్‌), అగ్నివీర్‌ (కాంబటెంట్‌) పోస్టుల నియామకాలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు యువతకు సూచించారు. భారతీయ పురుషులను ఎయిర్‌మెన్‌ (మేడ్‌ అసిస్టెంట్‌), అగ్నీవీర్‌లుగా శాశ్వత కేడర్‌లో నియమించేందుకు ఐఏఎఫ్‌ ఎంపిక పరీక్ష నిర్వహిస్తోందని తెలిపారు. ఆసక్తి కలిగిన యువత ఈనెల 26వ తేదీ రాత్రి 11 గంటల్లోపు http://iafrecruitment.edci.co.in వెబ్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రొవిజనల్‌ అడ్మిట్‌ కార్డు పొందిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక పరీక్షకు అనుమతిస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement