ధర్మవరం: అక్రమార్కుల చెరలో చిత్రావతి నది నలిగిపోతోంది. ఇసుక అక్రమ రవాణాను ఆదాయ వనరుగా మార్చుకున్న కూటమి పార్టీల నాయకులు రూ.కోట్లు గడిస్తున్నారు. జేసీబీలు, హిటాచీలతో రాత్రింబవళ్లు చిత్రావతి నది నుంచి ఇసుకను తోడేస్తూ టిప్పర్లతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు.
ఆ రెండు మండలాల నుంచే..
చిత్రావతి నది ధర్మవరం నియోజకవర్గంలో ధర్మవరం, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ప్రవహిస్తోంది. నదిలో ఇసుక లభ్యత ఎక్కువగా ఉండటం, పైగా నాణ్యత ఉండటంతో ఇతర ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఉండటంతో కూటమి పార్టీల నాయకులు చిత్రావతిపై కన్నేశారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా చైన్నె హైవేకు సమీపంలోని బత్తలపల్లి మండలంలోని రామాపురం, కోడేకండ్ల, కట్టకిందపల్లి, డీ చెర్లోపల్లి, ముదిగుబ్బ మండల పరిధిలో కొడవండ్లపల్లి, గంగిరెడ్డిపల్లి సరిహద్దుల్లో చిత్రావతి నది నుంచి జేసీబీలు, హిటాచీలతో రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో టిప్పర్ ఇసుకను రూ.50 వేల చొప్పున విక్రయిస్తున్నారు. పొరుగు జిల్లాలయితే టిప్పర్ ఇసుక (20 టన్నులు) రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు విక్రయిస్తున్నారు.
రీచ్‌లున్నా ఉపయోగం లేదన్నా..
ధర్మవరం నియోజకవర్గంలో ప్రభుత్వం రెండు ఇసుక రీచ్‌లను ఏర్పాటు చేసింది. అందులో తాడిమర్రి మండలం సీసీరేవు వద్ద ఒకటి, ముదిగుబ్బ మండలం పీసీరేవు వద్ద మరొకటి ఏర్పాటు చేసింది. వాస్తవంగా అయితే రీచ్‌లలో ఇసుక కావాల్సిన వారు డబ్బు చెల్లించి కొనాలి. తద్వారా వచ్చిన ఆదాయం ప్రభుత్వానికి వెళుతుంది. కానీ దాని వల్ల తమకేం ప్రయోజనం అనుకున్న కూటమి నాయకులు కొత్త దందాకు తెరలేపారు. రీచ్‌లతో పని లేకుండా ఇసుకను సొంతంగా తోడేసి ఓచోట డంప్ చేసి ఇసుక అవసరమైన వారికి అమ్ముకుంటున్నారు. ఇలా వచ్చిన సొమ్మును తలా కొంత పంచుకుంటున్నారు. ఎవరికి ఇసుక కావాలన్నా కూటమి నాయకులకు డబ్బు చెల్లించి తోలుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
చిత్రావతిని పంచుకున్న నేతలు..
చిత్రావతి నదీ పరివాహక ప్రాంతాలను టీడీపీ, బీజేపీ నాయకులు హద్దులు వేసుకుని మరీ పంచుకున్నారు. బత్తలపల్లి నుంచి తాడిమర్రి మండలం సీసీ రేవు వరకు ధర్మవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్యనేత ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా... ముదిగుబ్బ మండలం ప్రారంభం నుంచి పీసీరేవు దాకా అనంతపురం జిల్లాకు చెందిన ఓ బీజేపీ నేత దందా సాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఇద్దరి నేతలు ఇష్టానుసారంగా రీచ్‌లోని ఒక బిల్లును చూపించి పది నుంచి 20 దాకా టిప్పర్లను సరిహద్దులు దాటిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరోవైపు ఈ ఇద్దరి నేతల ఇసుక అక్రమ రవాణాపై చిత్రావతి సరిహద్దు గ్రామాల కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల పోలీసు, రెవెన్యూ శాఖలతో పాటు విజిలెన్స్ అధికారులు సైతం చోద్యం చూస్తున్నారు. ఇసుక అక్రమ దందా కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే నడుస్తుండటంతో చర్యలు చేపట్టకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. మరోవైపు బత్తలపల్లి, ముదిగుబ్బ పోలీస్‌స్టేషన్‌లకు ఇసుక అక్రమార్కులు భారీగా ముడుపులు ముట్టజెబుతున్నట్లుగా సమాచారం. అందుకే పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది.
‘‘తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు’’ అని భర్తృహరి చెబితే దాన్ని మరోరకంగా అర్థం చేసుకున్న కూటమి నాయకులు దాన్ని పొల్లుపోకుండా పాటిస్తున్నారు. ఇసుకను
పిండి డబ్బులు కురిపించుకుంటున్నారు. చిత్రావతి నదిని తూర్పారబడుతూ భారీగా ఆర్జిస్తున్నారు. అన్నీ తెలిసిన అధికార యంత్రాంగం అమ్యామ్యాలతో కళ్లుమూసుకుంది.


