అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల జిల్లా విభజన ప్రక్రియలో అత్యంత కీలకమైన సీనియార్టీ జాబితాల ప్రకటన విషయంలో జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ జీవితాన్ని ప్రభావితం చేసే ఈ ప్రక్రియలో చిన్న పొరపాటు జరిగినా ఉపాధ్యాయులు శాశ్వతంగా నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ, అధికారులు తూతూమంత్రంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఈఓ కార్యాలయంలో స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీలు, హెచ్‌ఎంలు, పండిట్ల సీనియార్టీ జాబితాల బాధ్యతను పరిమిత సిబ్బందితోనే నిర్వహిస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇటీవల కీలక బాధ్యతలు చూసే ఏఎస్‌ఓ బదిలీ కావడంతో, ప్రస్తుతం ఇన్‌చార్జి వ్యవస్థలోనే పని సాగుతోందని, దీనివల్ల సవరణల ప్రక్రియ నత్తనడకన సాగుతోందని విమర్శిస్తున్నారు. ఇటీవల ఎంఈఓలు, హెచ్‌ఎంలతో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరించినప్పటికీ, అప్పట్లో గుర్తించిన పలు తప్పులు ఇంకా సరిదిద్దలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ సోమవారం తాత్కాలిక తుది సీనియార్టీ జాబితాలను వెబ్‌సైట్‌లో ఉంచడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని అంటున్నారు. జాబితాల్లో తప్పులు ఉంటే గూగుల్ స్ప్రెడ్‌షీట్‌లో నమోదు చేయాలని సూచించిన అధికారులు, అభ్యంతరాలు తెలియజేయడానికి చివరి తేదీని స్పష్టంగా ప్రకటించకపోవడం గందరగోళానికి దారితీసింది. రెండు రోజులు ఉంటే అందులో ఏయే తేదీలు అనేది స్పష్టత లేదు. కనీసం పత్రికా ప్రకటన విడుదల చేయకపోవడం, ఎంఈఓలు, హెచ్‌ఎంలకు ప్రత్యేకంగా సమాచారం ఇవ్వకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో జిల్లా విభజన ప్రక్రియ వేగంగా సాగుతుండగా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మాత్రం ఆలస్యం, వరుస తప్పిదాలు ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ముడిపడిన ఈ ప్రక్రియను విద్యాశాఖ అత్యంత పారదర్శకంగా, తప్పుల్లేకుండా నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. చిన్న పొరపాటు జరిగినా తీవ్రంగా నష్టపోతామమని, అందువల్ల విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు.
సీనియార్టీ జాబితాల విడుదలలో
అంతులేని నిర్లక్ష్యం
సవరణల గడువుపై స్పష్టత కరువు
మండిపడుతున్న టీచర్లు


