కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకను సోమవారం లెక్కించారు. 57 రోజులకు గాను రూ. 1,07,23,498 నగదుతో పాటు 7 గ్రాముల బంగారు, 432 గ్రాముల వెండి, రెండు అమెరికా డాలర్లు, ఒక మలేషియా రూపే, అరబ్ దినార్లు వచ్చినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఆదాయం పెరిగిందన్నారు. హుండీల లెక్కింపు కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణ అధికారి ప్రసాద్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్, ఆలయ సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడే ఆఖరు ‘సర్’
● ఇంకా పెండింగ్‌లో 20 వేల
ఈఎఫ్‌ల డిజిటలైజేషన్
పుట్టపర్తి అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమం మంగళవారంతో ముగియనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా బీఎల్‌ఓలు ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు (ఈఎఫ్) పంపిణీ చేశారు. ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా వేగవంతం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన గడువు మంగళవారంతో ముగియనుండగా...ఇంకా 20 వేల ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ ప్రక్రియ పెండింగ్‌లోఉంది. ఒక్కరోజులోనే అన్ని ఈఎఫ్‌ల డిజిటలైజేషన్ సాధ్యమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా చాలా మంది ఈఎఫ్‌లు పూర్తి చేసి ఇవ్వలేదు. వారంతా మంగళవారం నాటికి బీఎల్‌ఓలకు ఈఎఫ్‌లు అందజేయాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
జిల్లాలో 98.62 శాతం పూర్తి..
జిల్లాలో 14,23,839 మంది ఓటర్లుండగా... 15 రోజుల్లో ఈఎఫ్ ఫారాలు అందజేసి తిరిగి తీసుకొని 14,04,152 ఈఎఫ్‌లు (98.62 శాతం) డిజిటలైజేషన్ పూర్తి చేశారు. అత్యధికంగా హిందూపురం నియోజక వర్గంలో 99.77 శాతం, పెనుకొండ నియోజక వర్గంలో 99.58 శాతం, కదిరిలో 99.13 శాతం, పుట్టపర్తి నియోజక వర్గంలో 98.28 శాతం, ధర్మవరంలో 97.66 శాతం, మడకశిరలో 97.01 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. మంగళవారం చివరి రోజు కావడంతో ఇప్పటికీ సుమారు 19,687 ఈఎఫ్‌లు డిజిటలైజేషన్ కావాల్సి ఉంది. మంగళవారం అర్ధరాత్రితో గడువు ముగిసి పోతుంది. తర్వాత యాప్‌కూడా ఓపెన్ కాదని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.


