కమ్ముకున్న కరువు మేఘం | - | Sakshi
Sakshi News home page

కమ్ముకున్న కరువు మేఘం

Jul 14 2026 4:35 AM | Updated on Jul 14 2026 4:35 AM

కదిరి: జిల్లాను కరువు మేఘం కమ్మేసింది. తొలకరితో పలకరించిన వరుణుడు ఆ తర్వాత ముఖం చాటేయడం.. జూలై రెండోవారంలోనూ ఎండలు దంచేస్తుండటంతో ఖరీఫ్‌లో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో ఈసారి తీవ్రమైన కరువు పరిస్థితులు రావచ్చని నిపుణుల హెచ్చరికలు అన్నదాతలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.

పంటలు ఎండుముఖం..

జూన్‌ నెల జిల్లా సాధారణ వర్షపాతం 67.6 మి.మీ కాగా, 59.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 95 మి.మీ కాగా ఇప్పటి దాకా ఎక్కడా పదును వాన పడలేదు. అరకొర జల్లులు సేద్యానికి ఏమాత్రం ప్రయోజనం లేదని రైతులు అంటున్నారు. జూన్‌లో కురిసిన ముందస్తు వర్షాలకు జిల్లాలో అక్కడక్కడా వేరుశనగతో పాటు కంది, ఇతరాత్ర పంటలు సాగు చేశారు. కానీ వర్షాభావ పరిస్థితుల కారణంగా అవన్నీ ఎండుముఖం పట్టాయి. ఖరీఫ్‌లో ప్రధానంగా సాగుచేసే వేరుశనగకు ఈ నెల రెండో వారం మంచి అదను. అయితే ఇంత వరకూ వర్షం కురవలేదు. కనీసం 50 మి.మీ వర్షం కురిస్తేనే వేరుశనగ విత్తుకోవడానికి సాధ్యపడుతుందని లేదంటే విత్తనాలు మొలకెత్తడం కష్టమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నెలాఖరుతో వేరుశనగ సాగుకు అదను దాటిపోతుందని, ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలే మేలని వారు సూచిస్తున్నారు.

సూపర్‌ ఎల్‌నినోగా మారే అవకాశం..

జిల్లాలో ఇప్పటికే ప్రభావం చూపుతున్న ఎల్‌నినో మరింత ప్రమాదకరంగా మారనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్‌ నాటికి ఇది సూపర్‌ ఎల్‌నినోగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

ప్రత్యామ్నాయం మరచిన అధికారులు

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకునేలా ప్రోత్సహించాల్సిన అధికారులు అటువైపు దృష్టి సారించలేదు. కనీసం జిల్లాకు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపలేదు.

ఎల్‌నినోతో ముఖం చాటేసిన వరుణుడు

ఎండాకాలాన్ని తలపిస్తున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో ముందుకు కదలని

ఖరీఫ్‌ పంటల సాగు

నెలాఖరుతో ముగియనున్న

వేరుశనగ అదను

అదనుదాటితే వద్దు

ఖరీఫ్‌లో ఇప్పటి దాకా కేవలం 9 శాతం మాత్రమే వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. ఈ నెలాఖరు వరకూ వేరుశనగ సాగు చేసుకోవచ్చు. అదనుదాటిన తర్వాత వర్షం కురిసినా వేరుశనగ సాగు వద్దు. ప్రత్యామ్నాయంగా కంది సాగు చేసుకుంటేనే రైతులకు మేలు జరుగుతుంది. – డా.బీవీ భాస్కర్‌రెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త,

వేరుశనగ పరిశోధన స్థానం, కదిరి

ఈసారీ కరువే

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి జూలైలోనూ ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు లేక పంటల సాగు అగమ్యగోచరంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఈ ప్రభావం పంటల మీదే కాకుండా పశుసంపద మీద కూడా పడుతోంది. ఈసారి కూడా కరువే. – రైతు ఓబిరెడ్డి, బుచ్చయ్యగారిపల్లి,

బుక్కపట్నం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement