● నిబంధనలు పాటించని
9 కార్యాలయాలకు నోటీసులు
● రాష్ట్ర సమాచార కమిషనర్ ఆదెన్న
పుట్టపర్తి అర్బన్: ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీ తనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ఎంతో కీలకంగా పని చేస్తుందని, అలాంటి చట్టాన్ని అమలు చేయడంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర సమాచార కమిషనర్ జి.ఆదెన్న హెచ్చరించారు. సోమవారం ఆయన జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. హిందూపురం, ధర్మవరం పుట్టపర్తి మండలంలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని డ్వామా, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖ, ట్రెజరీ, మున్సిపల్ తదితర కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. పెండింగ్ దరఖాస్తుల గురించి ఆరా తీశారు. స.హ చట్టం అమలులో నిర్లక్ష్యంగా ఉన్న పలువురు ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్లు 18(3), 18(4), 19(8)(ఏ) కింద తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ ఛార్టర్లు ఏర్పాటు చేయలేదని, ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లతో కూడిన డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో హిందూపురం మున్సిపల్ కార్యాలయం, హిందూపురం ఎంజీఎం ఉన్నత పాఠశాల, హిందూపురం ఉప రిజిస్ట్రార్ కార్యాలయం, పెడపల్లి ఉన్నత పాఠశాల, పుట్టపర్తిలోని డీఎంహెచ్‌ఓ, ఐసీడీఎస్ పీడీ కార్యాలయం, డ్వామా కార్యాలయం. పుట్టపర్తి ట్రెజరీ కార్యాలయం, ధర్మవరం మున్సిపల్ కార్యాలయం అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు. వారు 15 రోజుల్లోపు కమిషన్‌కు వివరణ ఇవ్వాలన్నారు.


