హిందూపురం: హిందూపురం పట్టణంలోని మధుర మీనాక్షి కళ్యాణ మండపంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళా సాధికారత వారోత్సవాలను పురస్కరించుకుని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా అడిషనల్ జడ్జి శైలజా, ఎస్పీ సతీష్‌కుమార్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని రక్తాని అందిస్తే ఏదైనా అవుతుందనే అపోహలు వదిలేయాలన్నారు. దాతల ద్వారా సేకరించిన రక్తాన్ని హిందూపురం, పెనుకొండ, మడకశిర ప్రభుత్వ ఆస్పత్రులకు అందజేస్తామన్నారు. మహిళల భద్రత మనందరి బాధ్యత అని, మహిళలపై జరుగుతున్న నేరాలను నియంత్రించేందుకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మహేష్, సీఐలు ఆంజనేయులు, కరీం, జనార్ధన్, రాజగోపాల్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.
మతవిద్వేషాలు రెచ్చగొట్టారని ఇద్దరి అరెస్టు
హిందూపురం: మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే సహించేదిలేదని ఎంతటివారినైనా వదిలేదిలేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సతీష్‌కుమార్ హెచ్చరించారు. మంగళవారం హిందూపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. హిందూపురంలో గత నెల 9న హిందూపురంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఊరేగింపు తర్వాత మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన, షేర్ చేసిన వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశామన్నారు. హిందూపురం పులేకమ్మ గుడి వద్ద ఉన్న జి.మన్విత్ , హస్నాబాద్‌కు చెందిన సమ్యద్‌షాబాద్‌ను అరెస్టు చేశామన్నారు. అలాగే హస్నాబాద్‌కు చెందిన నితిన్, సయ్యద్ షాబాజ్, మోడల్‌కాలనీకి చెందిన షేక్ ఇమ్రాన్, సందీప్, ఆర్టీసీ కాలనీ రాజకుమార్‌లకు 41ఏ సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేశామన్నారు. ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్టులు పెట్టినా వాటిని ఫార్వర్డ్ చేసినా గ్రూపు అడ్మిన్‌తో పాటు వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అవరసరమైతే రౌడీషీట్లు ఓపెన్ చేస్తామన్నారు. డీఎస్పీ మహేష్, హిందూపురం సీఐలు రాజగోపాల్‌నాయుడు, ఆంజినేయులు, జనార్ధన్, అబ్దుల్‌కరీం తదితరులు పాల్గొన్నారు.


