రొళ్ల: స్వగ్రామంలో హీరో అర్జున్ సందడి చేశారు. అగళి మండలం బొమ్మసానిపల్లి సమీపంలో కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా జక్కేనహళ్లిలో వెలసిన లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో సినీ హీరో అర్జున్ సర్జ పాల్గొన్నారు. జక్కేనహళ్లికి చెందిన హీరో అర్జున్ బెంగళూరులో స్థిరపడ్డారు. అల్లుడు ధృవ సర్జతో పాటు పలువురు తమిళ, కన్నడ సినీ నటులు ఉత్సవాలకు హాజరయ్యారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే స్వగ్రామం జక్కేనహళ్లిలో జరిగే లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అర్జున్ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోందని గ్రామానికి చెందిన లోకేష్ తెలిపారు. ముందుగా అర్జున్ ఇంటి నుంచి రథం వరకూ మహిళలు కలశాలను మోసుకుని ఊరేగింపుగా మేళతాళాలతో ఆలయం వద్దకు వచ్చారు. నృసింహస్వామి మూల విరాట్‌కు విశేష పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అర్జున్, ధృవ సర్జ భక్తులతో కలిసి రథం లాగారు. అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ స్థానికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
చెక్‌బౌన్స్ కేసులో
ఆరునెలలు జైలుశిక్ష
హిందూపురం: చెక్‌బౌన్స్ కేసులో ముద్దాయికి ఆరు నెలల సాధారణ జైలుశిక్ష విధిస్తూ స్థానిక ప్రత్యేక న్యాయమూర్తి రమణయ్య మంగళవారం తీర్పు వెల్లడించారు. పట్టణంలోని లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వైఎల్ శ్రీనివాసులు నుంచి రూ.8 లక్షలు అప్పు తీసుకున్నాడు. వడ్డీతో పాటు రూ.8.80 లక్షలకు శ్రీనివాసులుకు 2023 మార్చి 30న చెక్ ఇచ్చాడు. ఆ చెక్కును శ్రీనివాసులు బ్యాంకులో జమ చేయగా అది బౌన్‌్స్ అయింది. దీంతో శ్రీనివాసులు కోర్టులో కేసు దాఖలు చేశాడు. వాదనలు విన్న న్యాయమూర్తి రమణయ్య నేరం రుజువు కావడంతో లక్ష్మీనారాయణకు ఆరు నెలల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.8.80 లక్షలను రెండు నెలల్లోపు చెల్లించాలని తీర్పునిచ్చారు. అలా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల పాటు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.


