● ఊరంతా ఖాళీ!
తాడిపత్రి రూరల్: శతాబ్దాల క్రితం జరిగిన బ్రాహ్మణ హత్య శాపంగా మారి గ్రామాన్ని వెంటాడుతోందని ఇప్పటికీ తాడిపత్రి మండలం తలారిచెరువు గ్రామస్తులు నమ్ముతున్నారు. ఈ కారణంగానే నాలుగు శతాబ్దాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఆదివారం పాటించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామున గ్రామం విడిచి సమీపంలోని హాజీవలి దర్గా ప్రాంతంలో బస చేశారు. పిల్లాపాప, వృద్ధులతో పాటు పశువులు, కోళ్లు, జీవాలు, ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు అన్నీ తమ వెంటే తీసుకెళ్లారు. అక్కడే వంట వార్పుతో సేదతీరారు. అర్ధరాత్రి తర్వాత పౌర్ణమి ఘడియలు దాటాక, అందరూ తిరిగి ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని, గ్రామానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించి, దీపాలు వేసి ఇల్లంతా శుద్ధి చేసుకుని, తలస్నానాలు చేసి దేవునికి పూజలు చేశారు.
..ఆ శాపం కారణంగానే
ఇందుకు సంబంధించి ఓ కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం బందిపోట్లతో కలిసి ఓ బ్రాహ్మణుడు ఊరిలో పండిన పంటను, ధనాన్ని దోచుకెళ్తుండేవాడు. గ్రామస్తులంతా కలిసి అతణ్ని చంపేశారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో పుట్టిన మగ శిశువులు మరణించడమే కాకుండా ఊరంతా కరవుకాటకాలతో అల్లాతుండేది. దీనిపై గ్రామస్తులు అప్పట్లో ఓ మునిని అడగగా బ్రాహ్మణ హత్య కారణంగానే గ్రామంలో మగపిల్లలు బతకడంలేదని, ఊరు అభివృద్ధి చెందడం లేదని, ప్రాయశ్చిత్తంగా మాఘశుద్ధ పౌర్ణమి నాడు ఊళ్లో నిప్పు రాజేయకుండా ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని సూచించారు. అలా చేయడంతో గ్రామానికి మంచి జరిగింది. ఈ ఆచారాన్ని పాటిస్తున్నందుకే గ్రామంలో అందరూ సంతోషంగా ఉన్నామని తలారిచెరువు గ్రామస్తులు అంటున్నారు.
● ఊరంతా ఖాళీ!
● ఊరంతా ఖాళీ!


