నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక
ప్రశాంతినిలయం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 1.30 వరకూ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. గతంలో ఇచ్చిన అర్జీలకు పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెవెన్యూ క్లినిక్‌ల ఏర్పాటు..
భూ వివాదాల పరిష్కారానికి కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటర్లలో ఆయా రెవెన్యూ డివిజన్ల అధికారులు అందుబాటులో ఉంటారన్నారు. అడంగల్ మార్పులు–చేర్పులు, మ్యుటేషన్లు, రస్తా, శ్మశాన వాటిక సమస్యలు, 22ఏ చుక్కల భూములు, సబ్ డివిజన్లు, పట్టాదార్ పేరు మార్పులు తదితర అన్ని సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారన్నారు. ఆదివారం ఆయా డివిజన్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాలపై ఆదేశాలు ఇచ్చారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా తెలియజేయాలని సూచించారు. ఆధార్‌కార్డు వెంట తీసుకురావాలన్నారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
105 మంది గైర్హాజరు
పుట్టపర్తి అర్బన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగిన ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు 105 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ విద్యశాఖాధికారి చెన్నకేశవప్రసాద్ పేర్కొన్నారు. 32 కళాశాలల్లో జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఇందులో జనరల్‌లో 1,506 మంది విద్యార్థులకు 1,444 మంది, ఒకేషనల్‌లో 999 మందికి 956 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
చిరుత సంచారం
నల్లచెరువు: మండలంలోని పోలేవాండ్లపల్లి – బాలేపల్లి తండా మార్గంలో ఆదివారం ఉదయం చిరుత కనిపించింది. సామచేనుబైలు గ్రామానికి చెందిన వెంకటేష్ తన కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై నల్లచెరువుకు వెళుతుండగా పొలాల్లో నుంచి రోడ్డు పక్కకు చిరుత రావడాన్ని గమనించాడు. సమాచారం అందుకున్న అటవీ సెక్షన్ అధికారి రామేశ్వరి, గార్డు సుబ్రహ్మణ్యం అకడ్కకు చేరుకుని చిరుత పాద ముద్రలు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నేడు కలెక్టరేట్‌లో పరిష్కార వేదిక


