కొలగానహళ్లిలో వ్యక్తి దారుణ హత్య
● మృతుడు హత్య కేసులో నిందితుడు
బొమ్మనహాళ్: హత్య కేసులో నిందితుడు దారుణహత్యకు గురయ్యాడు. కొలగానహళ్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కొలగానహళ్లికి చెందిన కావలి శ్రీకాంత్ అనే యువకుడు 2021 సంవత్సరంలో హత్యకు గురయ్యాడు. ఈ కేసులో కావలి రమేష్ (50) ఏ2 నిందితునిగా ఉన్నాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో రమేష్ వర్గీయులతో పాటు శ్రీకాంత్ వర్గీయులను పోలీసులు స్టేషన్‌లో బైండోవర్ చేశారు. గొడవల జోలికి పోకుండా ప్రశాంతంగా ఉండాలని చెప్పి పంపించేశారు. సాయంత్రం రమేష్ లింగదహాళ్‌లోని ఎరువుల షాప్‌కు వెళ్లి వస్తానని ద్విచక్రవాహనంపై వెళ్లాడు. అయితే రాత్రి ఎనిమిది గంటల సమయంలో రమేష్ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ సంఘటన స్ధలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులను విచారణ చేశారు. ప్రత్యర్థులు ఎవరో కాపు కాసి వేటకొడవళ్లతో నరికి చంపిన చంపినట్లు ప్రాథమిక విచారణలో తేల్చారు. రమేష్‌కు గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిసింది. హతుడికి భార్య రాధమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కొలగానహళ్లిలో వ్యక్తి దారుణ హత్య


