ప్రజాస్వామ్యం అపహాస్యం
ధర్మవరం: ప్రస్తుతం ధర్మవరం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా కాచర్ల లక్ష్మి ఉన్నారు. ఏడాది కాలంగా మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆమెకు కనీస ఆహ్వానం అందడం లేదు.ఇక వార్డుల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన పనులను మున్సిపల్ కౌన్సిల్‌లో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు వివరించినప్పటికీ కమిషనర్ సాయికృష్ణ కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అది అజెండాలో పొందుపరుస్తుండడం గమనార్హం.
అక్కడా అంతే..
మండలాల్లో ఎంపీపీలకూ అధికారులు కనీస గౌరవం ఇవ్వడం లేదు. ప్రస్తుతం ధర్మవరం ఎంపీపీగా వైఎస్సార్‌సీపీకి చెందిన గిరిక రమాదేవి, తాడిమర్రి ఎంపీపీగా పాటిల్ భువనేశ్వర్‌రెడ్డి, బత్తలపల్లి ఎంపీపీగా బగ్గిరి త్రివేణి ఉన్నారు. ఏ ప్రభుత్వ కార్యక్రమం జరిగినా వీరికి ఆహ్వానం అందించకుండా అధికారులు అవమానిస్తున్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి ఎంపీపీగా ఎన్నికైన ఆదినారాయణయాదవ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు మాత్రం పెద్దపీట వేస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇవేం రాచమర్యాదలు..
ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార పార్టీ నాయకులకు అధికారులు రాచమర్యాదలు చేస్తుండడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇటీవల ‘యోగాంధ్ర’తో పాటు పలు కార్యక్రమాల్లో బీజేపీ నాయకులను సభావేదికలపై ఆర్డీఓ మహేష్ పక్కనే కూర్చోబెట్టుకోవడం చూసి మేథావులు నోరెళ్లబెట్టారు. పదవులు లేని వారికి, పార్టీ మారిన వారికి ప్రాధాన్యత ఇస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థమేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు.
వారి ఫ్లెక్సీలైతే ఓకే..
ధర్మవరం ప్రధాన కూడళ్లలో ఇష్టారాజ్యంగా ఇనుప తీర్లు వేసి మరీ కూటమి పార్టీల నాయకులు ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా వాటిని అధికారులు పట్టించుకోవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, పార్టీ సానుభూతిపరులు ఫ్లెక్సీలు వేస్తే మాత్రం వెంటనే తొలగిస్తుండడం గమనార్హం. ఇలాంటి దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదని పట్టణవాసులు అంటున్నారు.
ధర్మవరం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులకు అధికారులు కనీసం గౌరవం ఇవ్వకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులు చూపుతున్న అంతులేని ‘పచ్చ’పాతం నియోజకవర్గ వాసులను విస్మయానికి గురి చేస్తోంది.
‘ధర్మవరం’లో విస్తుగొలుపుతున్న అధికారుల వైఖరి
వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వని వైనం
అధికార పార్టీ నాయకులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో అందలం
అంతులేని ‘పచ్చ’పాతంపై సర్వత్రా విమర్శలు
ప్రజాస్వామ్యం అపహాస్యం


