బెంబేలెత్తించిన కొండచిలువ
పుట్టపర్తి అర్బన్:పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువు సమీపంలో ఆదివారం ఓ కొండచిలువ రైతులు, గొర్రెల కాపర్లను బెంబేలెత్తించింది. గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ చైర్మన్ ఈశ్వరరెడ్డి పొలంలో కనిపించిన సుమారు 10 అడుగుల కొండచిలువ అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఫారెస్ట్ అధికారులు ఎంతకూ అటువైపు రాకపోవడంతో కాపర్లు దాన్ని కొండవైపు మళ్లించారు. సమీపంలోనే గొర్రెల మందలు తోలుతామని, అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నేడు పరిష్కార వేదిక
పుట్టపర్తి టౌన్: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఒక ప్రకనటలో తెలిపారు. పీజీఆర్‌ఎస్ మందిరంలో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చునన్నారు. గతంలో అర్జీలు సమర్పించినా పరిష్కారం దొరకని వారు 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. కలెక్టరేట్‌కు రాకుండానే Meekosam.ap.gov.in వె బ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ అర్జీలు సమర్పించుకొనే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లో కార్యక్రమం జరుగుతుందని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఉచిత గ్యాస్ కనెక్షన్ మాటున టీడీపీ నేత చేతి వాటం!
పుట్టపర్తి: పేదల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఉజ్వల’ పథకాన్ని కూడా కొందరు ‘పచ్చ’ నాయకులు ఉపాధిగా మార్చుకున్నారు. ఉచిత గ్యాస్ కనెక్షన్ పేరిట ఓ టీడీపీ నేత చేతివాటం ప్రదర్శించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవల పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి చేతుల మీదుగా పేద మహిళలకు ‘ఉజ్వల’ ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించారు. అయితే, 174 మందికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసేందుకు అమడగూరు మండలం కమ్మవారిపల్లికి చెందిన టీడీపీ నేత, ఇండియన్ గ్యాస్ డీలర్ అయిన శ్యాం నాయుడు ఒక్కొక్కరి నుంచి రూ.1,300 నుంచి రూ. 2,000 వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. గ్యాస్ కనెక్షన్ల అందజేత సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సింధూర రెడ్డి ఉచితంగా అందిస్తున్నామని చెప్పగా, డబ్బు చెల్లించిన లబ్ధిదారులంతా ఆశ్చర్యపోయినట్లు తెలియవచ్చింది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
పుట్టపర్తి టౌన్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పుట్టపర్తిలో కలకలం రేపింది. పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు తెలిపిన మేరకు.. కొత్తచెరువు మండలం తిప్పబాట్ల పల్లికి చెందిన వెంకటరాముడు, నాగరత్నమ్మ దంపతుల కుమారుడు మహేష్ చౌదరి (35) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నాడు. మహేష్ చౌదరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసేవాడు. వారం క్రితం స్నేహితులతో ఇతనికి గొడవ జరిగింది. దీనిపై కొత్తచెరువు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. డిసెంబర్ 31న స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన మహేష్ చౌదరి తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం పుట్టపర్తి పట్టణ సమీపంలో హంద్రీ–నీవా కాలువలో శవమై కనిపించాడు.గమనించిన స్థానికులు పుట్టపర్తి అర్బన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని బయటకు తీశారు. కర్రలు, రాళ్లతో కొట్టి చంపిన అనంతరం దుప్పట్లో కప్పి హంద్రీ–నీవా కాలువలో పడవేసినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సీఐ శివాంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహేష్ చౌదరికి 8 నెలల క్రితమే వివాహమైంది. పిల్లలు లేరని తెలిసింది.
బెంబేలెత్తించిన కొండచిలువ


