ఆహారం.. ఘోరాతిఘోరం!
● పుట్టగొడుగుల్లా వెలుస్తున్న
రెస్టారెంట్లు, హోటళ్లు, బేకరీలు
● ఇష్టారాజ్యంగా వంటకాలు
● ప్రజారోగ్యంతో ఆటలు
● నిమ్మకు నీరెత్తినట్లు
వ్యవహరిస్తున్న అధికారులు
పుట్టపర్తి టౌన్: జిల్లాలో పలు ధాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల్లో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న నిర్వాహకులు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నా అధికారులు ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు. జిల్లా వ్యాప్తంగా చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఫాస్ట్ పుడ్ సెంటర్లు మూడు వేలకు పైగా ఉన్నాయి. వీటి ద్వారా ఏటా రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది.
చర్యలేవీ..?
ఎక్కడైనా హోటళ్లు ఏర్పాటు చేయాలంటే కచ్చితంగా ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పని సరిగా ఉండాలి. అందులో పనిచేసే వంట మాస్టర్లు, సర్వర్లకు ఎలాంటి రోగాలూ లేవని వైద్యులు ధ్రువీకరించినట్లు సర్టిఫికెట్లు ఉండాలి. అయితే, జిల్లాలో 20 శాతం పైగా హోటళ్లకు ఎలాంటి అనుమతులు లేవని తెలిసింది. అయినా, వాటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు నిర్వహించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశమున్నా పట్టనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. మరోవైపు, ఇష్టారాజ్యంగా నడుపుతున్న ఆహార శాలలపై ఎప్పుడైనా అధికారులు దాడులు చేసినా అధికార పార్టీ నేతలు ఫోన్లు చేసి ఒత్తిడి చేస్తుండడంతో షరామామూలుగా మారుతోంది. సాధారణ ప్రజలకు శాపంగా మారుతోంది.
పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి వద్ద ఉన్న ఆర్‌సెట్(రూరల్ ఎంప్లాయిమెంట్ ఇన్‌స్టిట్యూట్)లో శిక్షణ పొందుతున్న 12 మంది ఇటీవల ఓ బేకరీలో కేక్ తిని అస్వస్థతకు గురయ్యారు. వారిని ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకులు అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్సఅందించారు. ఫుడ్ పాయిజన్ కావడంతోనే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సమీప ఎస్సీ కాలనీవాసులకు పంచిపెట్టారు. కేక్ తిన్న నిమిషాల్లోనే 15 మందికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. వైద్య సిబ్బంది హుటాహుటిన కాలనీకి చేరుకుని చికిత్సలు అందించాక కానీ ఉపశమనం లభించలేదు. ఈ రెండే కాదు.. గడచిన నెలరోజుల్లోనే జిల్లాలో ఇలాంటి అనేక ఘటనలు వెలుగుచూశాయి.
బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలి
హానికరమైన రంగులు, రసాయనాలతో చేసిన ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం సక్రమంగా పనిచేయవు. ఫలితంగా ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకుని బయటి ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
– ఫైరోజా బేగం, డీఎంహెచ్‌ఓ
చర్యలు తీసుకుంటాం
నిబంధనలకు విరుద్ధంగా వెలసిన హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలపై చర్యలు తీసుకుంటాం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే సహించబోం. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లాలోని పలుచోట్ల బయటి ఫుడ్ తిని పలువురు అస్వస్థతకు గురైన విషయం మా దృష్టికి వచ్చింది. ఆయా బేకరీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించి శ్యాంపిల్స్ తీసి ల్యాబ్‌కు పంపించాం. నివేదిక రాగానే చర్యలు తీసుకొంటాం.
– దేవరాజ్, జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి


