సీమకు చంద్రబాబు మరణ శాసనం
ధర్మవరం: తన శిష్యుడైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పనులను ఆపి సీఎం చంద్రబాబు ఈ ప్రాంత వాసులకు మరణ శాసనం రాశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వ యకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్లూ చంద్రబాబు సీమకు అన్యాయమే చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేసే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు పనులు ఆపిన విషయాన్ని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. తూతూ మంత్రంగా ఓ ప్రకటన విడుదల చేసి ఎత్తిపోతల పథకం పనులు ఆపలేదని ప్రకటించడం గర్హనీయమని, స్వయంగా అక్కడికి వెళ్లి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం సాకారమైతే ఉమ్మడి అనంతపురం జిల్లా రైతులకు ఎంతో మంచి జరిగేదని, తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరడంతో పాటు భూగర్భ జలాలు కూడా పెంపొందేవన్నారు. ఓటుకు నోటు కేసులో శిష్యుడి చేతిలో బందీగా మారిన చంద్రబాబు రాయలసీమ ప్రజల భవిష్యత్‌ను తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.గతంలోనూ బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి రాయలసీమకు అన్యాయం చేసినా అప్పటి బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయకుండా మౌనంగా ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రజల అభీష్టానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నారన్నారు. గతంలో శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటూ అన్యాయం చేయాలని చూస్తే పోలీసులను పంపి మరీ రాష్ట్రానికి రావాల్సిన వాటాను దక్కించుకున్న ఏకై క నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి మొత్తాన్ని అమరావతికి పరిమితం చేసి లక్ష ఎకరాల్లో రాజధాని అంటూ తన అనుయాయులకు మంచి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆ ప్రాంత రైతులకు కూడా ద్రోహం చేస్తున్నారని, రియల్ ఎస్టేట్ కోసమే రాజధానిని వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
అంతా ఒక్కటవ్వాలి
జరుగుతున్న అన్యాయాన్ని రాయలసీమవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ఇప్పటికైనా ఖండించకపోతే భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని కేతిరెడ్డి హెచ్చరించారు. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులు, సాగునీటి రంగ నిపుణులు, మేథావులు, అఖిలపక్ష పార్టీల నాయకులు సీమకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద సీమకు రావాల్సిన నీళ్లను దక్కించుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
‘రాయలసీమ ఎత్తిపోతల’ను ఆపి
తీరని ద్రోహం చేసిన సీఎం
దుర్మార్గపు చర్యలతో భవిష్యత్తులో ఎడారిగా ఉమ్మడి అనంతపురం జిల్లా
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే
కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపాటు


