
అర్హత ఉన్నా.. పింఛన్లు తొలగించారు
● జాయింట్ కలెక్టర్‌కు
మొరపెట్టుకున్న వృద్ధులు
ప్రశాంతి నిలయం: ‘‘మేము ఏళ్లుగా సామాజిక పింఛన్లు తీసుకుంటున్నాం..మాకు పింఛన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయినా మా పింఛన్లు తొలగించారు. పింఛన్ డబ్బుతో జీవనం సాగించే మాకు అన్యాయం చేయకండి’’ అంటూ పలువురు వృద్ధులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు మొరపెట్టుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన వృద్ధులు నల్లమాడ రమణప్ప, నాగమణి, రామాంజినమ్మ, నందిని, పాపన్న తదితరులు జాయింట్ కలెక్టర్‌ను కలసి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తమకు అర్హత ఉన్నప్పటికీ అధికారులు వృద్ధాప్య పింఛన్ల జాబితా నుంచి పేర్లు తొలగించారన్నారు. పింఛన్లు అందకపోతే తాము ఎలా జీవించాలని వారు ప్రశ్నించారు. స్పందించిన జాయింట్ కలెక్టర్ అక్కడే ఉన్న డీఆర్‌డీఏ పీడీ నరసయ్యని పిలిచి అర్హులకు పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డ్వాక్రా రుణం మంజూరు చేయడం లేదు
తాము తీసుకున్న డ్వాక్రా రుణం కంతులన్నీ సక్రమంగా చెల్లించామని, అయినా తమకు తిరిగి రుణం మంజూరు చేయడం లేదని రామగిరి మండలం దుబ్బార్లపల్లికి చెందిన పెద్దయ్య స్వామి మహిళా సంఘం సభ్యులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌ను కలసిన పొదుపు సంఘం మహిళలు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. తాము తొలుత రూ.12 లక్షలు రుణం తీసుకుని పూర్తిగా చెల్లించామని, తిరిగి రుణం కావాలని కోరితే ఇచ్చేందుకు బ్యాంకర్లు కూడా ఒప్పుకున్నారన్నారు. అయితే వెలుగు అధికారులు రుణం రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులపై చర్యలు తీసుకుని తమకు రుణం ఇప్పించాలని కోరారు.