
అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం
● జిల్లా న్యాయ సేవాధికార సంస్థ
కార్యదర్శి రాజశేఖర్
హిందూపురం/ధర్మవరం అర్బన్: సబ్‌జైలులో ఉన్న ముద్దాయిల్లో అర్హులందరికీ కచ్చితంగా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. బుధవారం ఆయన హిందూపురం, ధర్మవరం సబ్‌జైళ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జైలు రికార్డులను పరిశీలించి ముద్దాయిలతో నేరుగా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతకాలంగా సబ్‌జైలులో ఉంటున్నారు... ఏ నేరంపై సబ్‌జైలుకు వచ్చారు..తదితర వివరాలు ఆరా తీశారు. అలాగే ములాఖత్ ద్వారా కుటుంబీకులతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారా.. తరచూ న్యాయవాదులు బంధువులతో మాట్లాడే అవకాశం ఉంటోందా అని అడిగారు. అలాగే వసతి, భోజన సౌకర్యాలపై ఖైదీలతో, సబ్‌జైలు అధికారులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, న్యాయవాదులను ఏర్పాటు చేసుకోలేని ముద్దాయిలు దరఖాస్తు చేసుకుంటే 48 గంటల్లోపు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామన్నారు. సబ్‌జైలులో ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదు చేయాలన్నారు. సబ్‌జైలు అధికారులు ఏమైనా ఇబ్బందులుపెట్టినా...సౌకర్యాలు కల్పించకపోయినా, వైద్య సహాయం అందించడంలో నిర్లక్ష్యం వహించినా నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. తర్వాత ఆయన జైలు గదులను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. హిందూపురం సబ్‌జైలర్ హనుమన్న, ధర్మవరం సబ్‌జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ శివరామకృష్ణయ్య, న్యాయవాదులు నవేరా, బాల త్రిపుర సుందరి, లోక్ ఆదాలత్ సిబ్బంది హేమావతి, పారా లీగల్ వలంటీర్ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉగ్రవాదుల సమాచారం పోలీసులకు తెలపండి
ధర్మవరం అర్బన్: పాకిస్తాన్ ఉగ్రవాదుల, ఉగ్రవాద గ్రూపులతో సంబంధం ఉన్న వారి గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ హేమంత్‌కుమార్ ప్రజలను కోరారు. బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు తెలిసినా, ఉగ్రవాదానికి ప్రేరేపించే వ్యక్తులు ఎక్కడైనా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఉగ్రవాదుల సమాచారం తెలిపిన వారికి పోలీసు శాఖ తరఫున బహుమతులు కూడా అందిస్తామన్నారు. సమాచారం ఇవ్వాలనుకునే వారు 9440796831 (ధర్మవరం వన్ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ), 6305800429 (టూ టౌన్ పోలీస్‌స్టేషన్ సీఐ), 9440796832 (ధర్మవరం రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ) నంబర్లను సంప్రదించాలని సూచించారు.

అర్హులందరికీ ఉచిత న్యాయ సహాయం