
ఎర్రకొండకు ఎసరు!
ధర్మవరం రూరల్: రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరిన తర్వాత టీడీపీ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో కొందరు నేతలు సహజ వనరులపై కన్నేసి కొల్లగొడుతున్నారు. కాసులకోసం కొండలనే కరిగిస్తున్నారు. ఎర్రమట్టి కోసం కొందరు టీడీపీ నేతలు ధర్మవరం మండలం మల్లాకాలువ గ్రామ సమీపంలోని ఎర్రకొండపై కన్నేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా యంత్రాలతో కొండ నుంచి గరుసు తవ్వి తరలిస్తుండగా... క్రమంగా కొండ కనుమరుగవుతోంది. ఇందుకు ఎలాంటి అనుమతులు లేకపోయినా... అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ఆ నలుగురే కీలకం..
ధర్మవరంలో వెంచర్లు వేస్తున్న వారు గుంతలు పూడ్చటం, మట్టిరోడ్లు వేసేందుకు ఎక్కువగా గరుసు మట్టిని వాడుతున్నారు. దీంతో గరుసుకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో నలుగురు టీడీపీ నాయకులు మట్టి మాఫియాగా మారారు. మల్లాకాలువ గ్రామ సమీపంలోని ఎర్రకొండలోని గరుసు మట్టిని యంత్రాలతో తవ్వి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా పట్టణంలోని ప్రైవేట్ ‘రియల్’ వెంచర్లకు రవాణా చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో ట్రాక్టర్ నుంచి రూ.1,000, టిప్పర్ నుంచి రూ.7 వేలు వసూలు చేస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు.
పేదల భూముల్లో రహదారులు
రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లు ఎర్రకొండ వద్దకు వెళ్తుతున్నాయి. ఈక్రమంలో సదరు టీడీపీ నాయకులు వాహన రాకపోకల కోసం రైతుల పొలాల్లో అడ్డదిడ్డంగా దారి వేశారు. దీంతో పొలాల్లోని మట్టి గట్టిగా మారి సాగుకు పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వెళ్లకూడదని పేద రైతులు వేడుకున్నా.... అవేమీ పట్టించుకోవడం లేదు. మరోవైపు గరుసు మట్టి ట్రాక్టర్లు, టిప్పర్లు నిత్యం తిరుగుతుండటంతో రహదారులు ఛిద్రమవుతున్నాయని పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల రెవెన్యూ, పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు రైతులు చెబుతున్నారు.
కన్నెత్తి చూడని అధికారులు
గరుసు మట్టిని పగలు, రాత్రి తేడా లేకుండా టీడీపీ నేతలు అక్రమంగా తరలిస్తున్నా.. అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా మట్టి యథేచ్ఛగా పట్ణణానికి సరఫరా అవుతున్నా.. అధికారులకు కనిపించకపోవడం ఏమిటని ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మట్టి తవ్వకాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
మల్లాకాలువ సమీపంలోని ఎర్రకొండలో గరుసు మట్టిని తవ్వుతున్న యంత్రం
గరుసు మట్టితో ధర్మవరంలోని ఓ వెంచర్‌కు వెళ్తున్న టిప్పర్
గరుసు కోసం ఎర్రకొండను
కరిగిస్తున్న టీడీపీ నేతలు
రవాణా కోసం పొలాల్లో
అడ్డదిడ్డంగా దారుల ఏర్పాటు
టిప్పర్ మట్టిని రూ.7 వేలకు విక్రయిస్తూ భారీగా ఆర్జన
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ఎర్రకొండకు ఎసరు!