
ఉపాధిలో మాయాజాలం
చిలమత్తూరు: వలసలు నివారించేందుకు ప్రవేశపెట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు వరంగా మారింది. ఫీల్డ్ అసిస్టెంట్లు మస్టర్లలో మాయాజాలం చేస్తుండగా... పనిచేయని వారికీ బిల్లులు మంజూరవుతున్నాయి. ఇలా వచ్చిన మొత్తాన్ని వాటాలు పంచుకుంటున్నారు.
హాజరు ఆన్‌లైన్ చేసినా ఆగని దందా
‘ఉపాధి’ నిధులు పక్కదారి పట్టకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. కూలీల హాజరును ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే వారి గ్రూప్ ఫొటోను ఎన్‌ఆర్‌ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్)లో మస్టర్ల వారీగా నమోదు చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఫీల్డ్ లెవల్ అధికారులు కొత్త దందాకు తెరతీశారు. ఒక మస్టర్ కింద పనిచేసిన 10 మంది కూలీల ఫొటో, వివరాలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మరో మస్టర్‌లో పనిచేయని కూలీల వివరాలు నమోదు చేసి పనిచేసిన కూలీల ఫొటోను దానికి అప్‌లోడ్ చేసేస్తున్నారు. ఒకే ఫొటోలో ఒకరిద్దరిని స్థానాల్ని మార్చి ఫొటోలు తీసి ఆన్‌లైన్ చేస్తున్నారు. దీంతో పనులు చేయని వారికీ బిల్లులు పడుతున్నాయి. ఆ డబ్బును కూలీలకు నామమాత్రంగా ఇచ్చి మిగిలినది అధికారులు పంచుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఒక్క మండలంలోనే 140 మందికి బిల్లులు
చిలమత్తూరు మండలంలో 2 వేల జాబ్ కార్డులున్నాయి. 600 మంది దాకా పనిచేస్తున్నారు. వీరిలో పనిచేయకుండా బిల్లులు పొందుతున్న వారు 140 మంది దాకా ఉన్నట్టుగా తెలుస్తోంది. రోజూ ఒక్కొక్క కూలీకి రూ.280 ఈ లెక్కన 140 మందికి రోజుకు రూ.39,200 కాగా 100 రోజులకు రూ.39.20 లక్షల అవినీతి జరుగుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా ఎంత సొమ్ము దుర్వినియోగం అవుతుందో అంచనా వేసుకోవచ్చు. ఈ సొమ్ము కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ పంచుకుంటున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హాజరు నమోదులో అవకతవకలు
ఒక మస్టర్ గ్రూపు ఫొటోను మరో మస్టర్‌కు అప్లోడ్ చేస్తున్న వైనం
పనులు చేయనివారికీ బిల్లులు.. రూ.లక్షల్లో స్వాహా

ఉపాధిలో మాయాజాలం

ఉపాధిలో మాయాజాలం