
అగళిలో 98 మందికి నోటీసులు
అగళి: మండలంలో 98 మంది దివ్యాంగుల పింఛన్లు రద్దు చేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగులు నోటీసులిచ్చారు. దీంతో ఆందోళనకు గురైన పింఛన్‌దారులు మంగళవారం మండల పరిషత్ కార్యాలయనికి పరుగులు తీశారు. అయ్యా తాము నిజంగా దివ్యాంగులమని, చూస్తేనే తమ పరిస్థితి తెలుస్తుందన్నారు. తమకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరినీ వేడుకున్నారు. ప్రస్తుతం మండల పరిధిలోని ఇనగలూర్‌లో 15, రావుడిలో 21, హళ్లికెరలో 6, మధూడిలో 3, ఇరిగేపల్లి–1 పరిధిలో 5, కోడిపల్లిలో 7, అగళిలో 14, ఆర్‌జీ పల్లిలో 8, పీ బ్యాడగేరలో 11, నరసంబూదిలో 8 చొప్పున మొత్తం 98 మంది పింఛన్లు తొలగిస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు.
మా పింఛన్ ఎందుకు
తొలగించారు
● ఎంపీడీఓను నిలదీసిన దివ్యాంగులు
తాడిమర్రి: ఎలాంటి పరిశీలన చేయకుండానే ఇష్టానుసారం పింఛన్లు తొలగించడంపై దివ్యాంగులు మండిపడ్డారు. పింఛన్ రద్దు నోటీసు అందుకున్న వారంతా కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని తాడిమర్రి, పిన్నదరి, కునుకుంట్ల, ఎం.అగ్రహారం, పెద్దకోట్ల, చిల్లకొండయ్యపల్లి, రామాపురం తదితర గ్రామాలకు చెందిన 50 మంది దివ్యాంగ పింఛన్‌దారులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అర్హత ఉన్నా తమ పింఛన్ ఎందుకు తొలగించారో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో ఎంపీడీఓ స్పందిస్తూ.. పింఛన్ గురించి ఎవరూ ఆదోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సోమవారం నిర్వహించనున్న రీఅసెస్మెంట్‌కు హాజరు కావాలన్నారు. ఒక అప్లికేషన్‌పై డిజిటల్ అసిస్టెంట్‌తో సంతకం చేయించుకుని, ఆధార్‌కార్డు, సదరం సర్టిఫికెట్‌లతో పాటు సచివాలయ ఉద్యోగులు అందించిన నోటీసులను తీసుకుని వచ్చి రీ అసెస్మెంట్ చేసుకోవాలని ఆయన సూచించారు.

అగళిలో 98 మందికి నోటీసులు