
తాగండి.. తాగి ఊగండి..!
కదిరి: ఇక నుంచి తాగినోడికి తాగినంత. వేళాలేదు. పాళా లేదు. రాత్రింబవళ్లు కిక్కే కిక్కు. బాగా తాగండి. తాగి ఊగండి..ఇదీ కూటమి ప్రభుత్వ లక్ష్యం. కొత్త బార్‌ల మద్యం పాలసీతో రోజంతా మద్యం అందుబాటులోకి రానుంది. జిల్లాలో ఇప్పటికే ఏరులై పారుతున్న మద్యం ప్రవాహం ఇకపై మరింత ఉధృతంగా ప్రవహించనుంది.
జిల్లాలో 11 బార్ల ఏర్పాటుకు అనుమతి
జిల్లాలో ఇప్పటికే 87 మద్యం దుకాణాలున్నాయి. వాటికి అనుబంధంగా ఈ మధ్యే పర్మిట్ రూమ్‌లకు కూడా కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక అనధికారికంగా పల్లె పల్లెలో బెల్ట్ షాప్‌లు వెలిశాయి. రోజూ రూ.2 కోట్ల వరకూ మద్యం వ్యాపారం నడుస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 11 బార్‌లకు లైసెన్స్‌లు మంజూరు చేసేందుకు సోమవారం(18న) గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కదిరిలో 3, ధర్మవరంలో 3, హిందూపురంలో 3, మడకశిరలో 1, పెనుకొండలో ఒక బార్ ఏర్పాటు చేయనున్నారు. 50 వేలలోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షలుపైబడి జనాభా ఉంటే రూ.75 లక్షలు చొప్పున ప్రతి ఏటా లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. బార్లకు దరఖాస్తు చేసుకునేందుకు రూ.5 లక్షల ధరావతు చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాపసు ఇవ్వరు. లాటరీ విధానంలో ఎంపిక ఉంటుంది. ఒక్కో బార్‌కు కనీసం 4 దరఖాస్తులు తప్పనిసరిగా ఉంటేనే లాటరీ తీస్తారు. లేదంటే మళ్లీ వాయిదా పడుతుంది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తులు సమర్పించాలి. 28వ తేదీన ఉదయం 8 గంటలకు జిల్లా కేంద్రంలోని సాయి ఆరామంలో లక్కీడ్రా ఉంటుంది. గతంలో రెండు బార్‌లు ఉన్న చోట ఆ సంఖ్యను మూడుకు పెంచింది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మూడేళ్ల పాటు ఈ బార్‌లకు అనుమతి ఉంటుంది.
అర్ధరాత్రి వరకూ అనుమతి
గతంలో జగన్ ప్రభుత్వం ప్రతి ఏటా మద్యం దుకాణాలతో పాటు బార్‌ల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాస్త కఠినంగానే వ్యవహరించిది. బార్‌లు కూడా ఉదయం 11 గంటలకు తెరిచి రాత్రి 11 గంటలకే మూసి వేయాలని ఆదేశించింది. కానీ కూటమి ప్రభుత్వం ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటలు వరకూ బార్‌లు తెరుచుకునేలా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో రూ.66 లక్షలుగా ఉన్న బార్ లైసెన్స్ ఫీజును రూ.55 లక్షలకు తగ్గించింది. గతంలో ఉన్న టెండర్ విధానాన్ని కూడా రద్దు చేసి లాటరీ విధానాన్ని తీసుకొచ్చింది. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి ఆదాయమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మహిళాలోకం మండిపడుతోంది.
ఖజానాకు ఫుల్ కిక్కు
ఇక నుంచి అర్ధరాత్రి 12 వరకు బార్‌లు
ఉదయం 10 గంటలకే ఓపెన్
కొత్త బార్ పాలసీ ప్రకటించిన
కూటమి సర్కార్